మీ మంచితనమే… మిమ్మల్ని ముంచేస్తోందా? సైకాలజీ చెప్పే నిజాలు!
“నువ్వు కాసేపు ఆగు…”
ఓ రోజు ఆఫీస్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది.
మీరు మధ్యలో ఒక పాయింట్ రైజ్ చేసి చెప్పబోతుంటే అక్కడ వాళ్లలో ఒకరు మధ్యలో అడ్డుపడ్డారు. మీరు నవ్వి “పర్లేదు, ముందు మీరు కానివ్వండి” అన్నారు. ఆ రోజుకి ఆ విషయం అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ నిజానికి ముగియలేదు.
వారం తర్వాత మళ్లీ అదే జరిగింది. కొన్ని నెలల తర్వాత మీటింగ్లో మీరు ఉన్నారు ఉన్నట్లుగానే ఎవరూ పట్టించుకోవటం లేదు. మీ అభిప్రాయం కూడా అడగడం మానేశారు.
సర్లే అని ఇంట్లో చూస్తే “నీకు తర్వాత చెబుతాంలే” అనే చెప్పా పెట్టకుండా అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు.మన ఫ్యామిలీ మెంబర్సే కదా అని మీరు ఏం మాట్లాడటం లేదు. ఇక ఆఫీసులో “ఈ పని ఎలాగూ తనే చేస్తాడులే” అనే ధోరణి. ఫ్రెండ్స్ మధ్యలో మీరే అందరికీ ఒక చౌకబారు జోక్. తెలిసినా మీ ప్రెండ్సే లే అని లైట్ తీసుకున్నారు. ఇలా ఎంతకాలం..అంటే సమాధానం..సాగినంతకాలం. మరి మీకు ఏమి అనిపించదా, అయినా వీళ్లందరికీ మీరే ఎందుకు సాప్ట్ టార్గెట్ అవుతున్నారు?
పోనీ మీవైపు నుంచి చూస్తే … మీరు ఎవరితోనూ గొడవపడలేదు. కోపపడలేదు. అందరితో మంచిగానే ఉన్నారు. కానీ మీ ప్రమేయం లేకుండానే మీ విలువ నెమ్మదిగా కరిగిపోతూ వచ్చింది.ఎందుకిలా జరుగుతోంది?
ఇవి కూడా చదవండి
మీరు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే… గౌరవం అనేది ఒక్కరోజులో పోదు. మన చుట్టూ మనం గీసుకున్న హద్దులు ఒక్కొక్కటిగా చెరిపేస్తూ ఉంటే, అది నిశ్శబ్దంగా మాయమవుతుంది.
ఇలాంటప్పుడు చాలామంది ఎదుటివారిని నిందిస్తుంటారు. “వాళ్లకు మర్యాద లేదు” అని బాధపడుతుంటారు. కానీ సైకాలిజీ చెప్పే నిజం వేరేలా ఉంది. మనుషులు మనం చెప్పే మంచి మాటలను గుర్తుంచుకోరు. మనం పదేపదే అనుమతించే ప్రవర్తనను మాత్రమే గుర్తుంచుకుంటారు.
ఒకసారి ఆలోచించండి
మిమ్మల్ని నిజంగా ఎదుటివారు అవమానించారా? లేక మిమ్మల్ని చులకన చేసే హక్కును మీరే తెలియకుండా వారి చేతిలో పెట్టారా?
మంచితనం ఉండటం తప్పు కాదు. కానీ ప్రతి విషయానికీ ‘సరే’ అనడం, ప్రతి పనినీ ‘నేనే చేస్తా’ అని నెత్తిన వేసుకోవడం, ప్రతి అవమానాన్నీ ‘పోనీలే వదిలేయ్’ అని భరించడం, ఏ తప్పు చేయకపోయినా ‘సారీ’ చెప్పడం… ఇవి మనల్ని మంచి మనుషులుగా నిలబెట్టవు. చాలా సులభంగా వాడుకోవచ్చనే వ్యక్తులుగా మార్చేస్తాయి.
మనం ఒక్కసారి మన హద్దు దాటేందుకు అనుమతిస్తే, రెండోసారి అది ఎదుటివారి ధైర్యంగా మారుతుంది. మూడోసారి అది వారికి అలవాటవుతుంది. నాలుగోసారి గౌరవం లేని బంధంగా మారిపోతుంది.
గౌరవం పోతోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు
మీకు తెలియకుండానే మీ గౌరవం పోతోందో లేదో చెప్పే కొన్ని స్పష్టమైన సంకేతాలు మన చుట్టూనే ఉంటాయి. మీ మాట పూర్తికాకముందే కట్ చేసి వేరొకరు మాట్లాడటం, మీ సమయానికి కనీస విలువ ఇవ్వకపోవడం, అవసరం ఉన్నప్పుడు తప్ప పండగలకి, సంబరాలకి మిమ్మల్ని గుర్తుచేసుకోకపోవడం. ఇందులో ప్రధానమైనవి.
అలాగే మీరు ఎంత గట్టిగా ‘లేదు’ అని చెప్పినా ఎవరూ సీరియస్గా తీసుకోకపోవడం, ప్రతి చిన్న నిర్ణయానికీ మీరు పేజీల కొద్దీ వివరణలు ఇవ్వాల్సి రావడం, మీపై హేళనగా జోకులు వేయడం సాధారణమైపోవడం, చివరికి తప్పు మీది కాకపోయినా గొడవ వద్దని మీరే క్షమాపణలు చెప్పే పరిస్థితి రావడం…
ఈ లక్షణాల్లో సగానికి పైగా మీ జీవితంలో ఉంటే, సమస్య ఎదుటివారిలో మాత్రమే లేదు. మీరు గీసుకున్న హద్దుల్లో కూడా ఉంది.
చరిత్రను ఒకసారి గమనిస్తే…
అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ తొలిసారి సెనేట్లో మాట్లాడటానికి నిలబడినప్పుడు ఒక ధనిక సెనేటర్ లేచాడు. “మిస్టర్ లింకన్, మీ నాన్న మా ఇంట్లో చెప్పులు కుట్టేవాడనే విషయం మర్చిపోకండి” అని అందరి ముందూ ఎగతాళి చేశాడు. ఆ మాటకి సభ అంతా గట్టిగా నవ్వింది.
ఆ క్షణంలో లింకన్ కోపంతో ఊగిపోవచ్చు లేదా తనను తాను సమర్థించుకుంటూ వాదించవచ్చు. కానీ ఆయన ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, “అవును, మా నాన్న చెప్పులు కుట్టేవారు. కానీ ఆయన తన పనిని ఒక కళగా, ఆత్మసంతృప్తితో చేసేవారు. ఆయన కుట్టిన చెప్పులపై మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పండి. ఆ విద్య నాకు కూడా వచ్చు, మీకు ఇంకో జత తయారు చేసి ఇస్తాను” అన్నారు.
ఆ ఒక్క సమాధానంతో అక్కడ గెలిచింది లింకన్ ఆలోచనా విధానం. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్నవారు తమ విలువను ఇతరుల చప్పట్లతోనో, కామెంట్లతోనో కొలవరు.
మీ విలువను నెమ్మదిగా చంపేసే అలవాట్లు
అందుబాటు: అందరికీ, వెంటనే Reply ఇవ్వడం.
ఓవర్ గా వివరణలు: ప్రతి చిన్న విషయానికీ Explanation ఇస్తూ కూర్చోవడం.
భయంతో జీవించడం: “ఛా! వాళ్లు ఏమనుకుంటారో?” అని సొంత ఇష్టాలను చంపుకోవడం.
సరిహద్దులు లేకపోవడం: ఎప్పుడు పిలిచినా సొంత పని పక్కనబెట్టి వాళ్ల దగ్గర వాలిపోవడం.
నో చెప్పకపోవడం: “లేదు, నా వల్ల కాదు” అని చెప్పడానికి భయపడటం.
చివరగా…
జీవితంలో గౌరవం కోల్పోవడం చాలా అరుదుగా ఒక పెద్ద సంఘటనతో మొదలవుతుంది. అది మనం పట్టించుకోని చిన్న చిన్న క్షణాలతో మొదలవుతుంది.
ఒకసారి మౌనం…ఒకసారి రాజీ, ఒకసారి “పర్లేదు”…అంతే. ఆ తర్వాత మన గురించి ఇతరులు ఏర్పరచుకునే అభిప్రాయం… మనం చెప్పిన మాటలతో కాదు, మనం అంగీకరించిన హద్దులతో రూపుదిద్దుకుంటుంది.
అందుకే గౌరవాన్ని కాపాడుకోవడం అంటే…ఇతరులను మార్చడం కాదు. మన విలువను తగ్గించే ప్రతి చిన్న రాజీని గుర్తించి, అక్కడి నుంచే ఆపేయడం








