రుద్దాల్సిన పనిలేదు.. ఈ రెండు పదార్థాలతో టాయిలెట్ మరకలు ఈజీగా మాయం..
టాయిలెట్‌ను ఎంత తరచుగా శుభ్రం చేసినా కొంతకాలానికి లోపల గోధుమరంగు మరకలు కనిపించడం సహజం. ముఖ్యంగా హార్డ్ వాటర్ ఉపయోగించే ఇళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నీటిలో ఉండే ఖనిజాలు క్రమంగా పేరుకుపోవడం వల్ల ఈ మరకలు ఏర్పడతాయి. చాలామంది వాటిని తొలగించడానికి టాయిలెట్ బ్రష్‌తో బలంగా రుద్దుతూ శుభ్రం చేస్తుంటారు. అయితే అలా చేయకుండా కూడా సులభంగా ఈ మరకలను తొలగించే ఒక సింపుల్ పద్ధతి ఉంది.
ఈ చిట్కాకు ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఉండే రెండు సాధారణ పదార్థాలే చాలు. అవి బేకింగ్ సోడా, వైట్ వెనిగర్. ఈ రెండింటి కలయిక టాయిలెట్లో పేరుకుపోయిన గట్టి మరకలను కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

ముందుగా టాయిలెట్ బౌల్లో ఉన్న నీటిని కొద్దిగా తగ్గిస్తే మరింత మంచి ఫలితం వస్తుంది. ఆ తర్వాత ఒక కప్పు బేకింగ్ సోడాను మరకలు ఉన్న ప్రాంతాల్లో సమంగా చల్లాలి. వెంటనే దానిపై ఒకటి నుంచి రెండు కప్పుల వైట్ వెనిగర్‌ను నెమ్మదిగా పోయాలి. ఈ రెండూ కలిసినప్పుడు బుడగలు వస్తాయి. అదే సాధారణ ప్రక్రియ. ఆ సమయంలో వాటిని కలపాల్సిన అవసరం లేదు.
ఈ మిశ్రమాన్ని కనీసం 30 నుంచి 60 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. మరకలు చాలా పాతవైతే రాత్రంతా అలాగే వదిలేయడం ఇంకా మంచిది. ఈ సమయంలో బేకింగ్ సోడా, వెనిగర్ కలిసి మరకలను మెల్లగా సడలిస్తాయి. తర్వాత కేవలం ఫ్లష్ చేస్తే చాలా వరకు మరకలు తొలగిపోతాయి. అవసరమైతే ఒకసారి మరలా ఇదే విధానాన్ని పాటిస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ పద్ధతి వల్ల టాయిలెట్ బ్రష్‌తో బలంగా రుద్దాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, బలమైన రసాయనాలు ఉపయోగించకుండా కూడా శుభ్రతను కాపాడుకోవచ్చు. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో ఇలాంటి సహజ పదార్థాలను ఉపయోగించడం మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ మిశ్రమం వాడే సమయంలో ముక్కుకు మాస్క్ వేసుకోవడం బెటర్.
టాయిలెట్లో మరకలు త్వరగా ఏర్పడకుండా ఉండాలంటే వారానికి కనీసం ఒకసారి ఈ పద్ధతిని పాటించడం మంచిది. అలాగే నీరు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చూసుకోవడం, టాయిలెట్‌ను క్రమం తప్పకుండా ఫ్లష్ చేయడం కూడా అవసరం. హార్డ్ వాటర్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఈ శుభ్రపరిచే విధానాన్ని అనుసరిస్తే ఖనిజాల పొరలు ఎక్కువగా పేరుకుపోవు.

కొంతమంది బ్లీచ్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకుంటారు. అయితే బ్లీచ్‌ను వెనిగర్‌తో కలపకూడదు. ఈ రెండు కలిస్తే హానికరమైన వాయువులు విడుదలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఒక శుభ్రపరిచే పదార్థాన్ని మాత్రమే ఉపయోగించాలి.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ సహజమైన పదార్థాలతో టాయిలెట్‌ను శుభ్రం చేస్తే అది ఎప్పుడూ పరిశుభ్రంగా కనిపించడమే కాకుండా, దుర్వాసన కూడా తగ్గుతుంది. ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే సులభంగా లభించే పదార్థాలతో టాయిలెట్‌ను మెరిసేలా ఉంచుకోవచ్చు. వారానికి కొద్దిసేపు కేటాయిస్తే గోధుమరంగు మరకలు పేరుకుపోకుండా ముందుగానే నివారించవచ్చు.








