టీటీఏ కన్వెన్షన్‌లో మిమిక్రీతో అలరించిన శివారెడ్డి
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. వేదికపై ఆయన చేసిన వివిధ రకాల వాయిస్ మిమిక్రీలు, కామెడీ టైమింగ్ ఆడిటోరియంలో ఉన్న వారిని కడుపుబ్బా నవ్వించాయి. గానకోకిల ఎస్.జానకి గొంతును ఇమిటేట్ చేస్తూ పాటలు పాడి కార్యక్రమాన్ని ప్రారంభించిన శివారెడ్డి, ఆ తర్వాత పలువురు ప్రముఖ గాయకులు, రాజకీయ నాయకుల శైలిని అనుకరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఘంటసాల, జేసుదాసు, రమణ గోగుల, జెస్సీ గిఫ్ట్ వంటి ప్రముఖుల గొంతులను శివారెడ్డి అద్భుతంగా ఇమిటేట్ చేశారు. ముఖ్యంగా గద్దర్ గారి వాయిస్‌తో ఆయన పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేవలం గాయకులనే కాకుండా రాజకీయ నాయకులు వి. హనుమంతరావు, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి రాజకీయ నాయకుల గొంతును కూడా ఆయన అద్భుతంగా అనుకరించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ శైలిని అనుకరిస్తూ చేసిన మిమిక్రీ, సదస్సులో ఉన్న వారిని ఆకట్టుకుంది. టీటీఏ కన్వెన్షన్‌లో శివారెడ్డి ప్రదర్శించిన మిమిక్రీ మెడ్లీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు ఆయనను సత్కరించారు.








