సెలెక్టర్లకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్..!
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ వన్డే భవిష్యత్తు గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డేనే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాబోతోందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బోర్డు రంగంలోకి దిగింది. రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు సంబంధించిన అంతర్గత సమాచారం మరియు చర్చలు మీడియాకు ఎలా లీక్ అయ్యాయనే విషయంపై బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే భవిష్యత్తులో మీడియా ప్రతినిధులతో ఎలాంటి సంభాషణలు లేదా ఇంటరాక్షన్లు పెట్టుకోవద్దని జాతీయ పురుషుల సెలెక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ గట్టి ఆదేశాలు జారీ చేసింది. లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదంటూ ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేసినప్పటికీ, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ శర్మ 11, 26 పరుగులతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కూడా లూప్‌లో ఉంచి, అఫ్గానిస్తాన్ సిరీస్‌కు ముందే సెలెక్టర్లు రోహిత్‌తో దీనిపై చర్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే బోర్డు ఉన్నతాధికారుల జోక్యంతో ఆయన జట్టులో కొనసాగుతున్నారని, ఈ ఊహాగానాల వల్ల గందరగోళం తలెత్తకుండా ఉండటానికే సెలెక్టర్ల నోటికి బోర్డు తాళం వేసిందని ఇండస్ట్రీ టాక్. ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ వన్డే ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది.. గత 8 వన్డే ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో యావరేజ్ 30.12 కాగా, స్ట్రైక్ రేట్ 88.60 గా ఉంది. ఈ గణాంకాలే సెలెక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూసేలా చేస్తున్నాయి.








