బీసీసీఐకి సునీల్ గవాస్కర్ వార్నింగ్..!
టీమిండియా పరాజయాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించనుండటం, అందులో భాగంగా కొందరిపై వేటు పడనుందనే ఊహాగానాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కేవలం నాలుగు నెలల క్రితమే టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని, ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ఆటగాళ్లపై వేటు వేయడం వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని గవాస్కర్ బీసీసీఐని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో సాగలేదు. 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన కొన్ని నెలలకే టీమిండియా ఐర్లాండ్‌తో 2-0 తేడాతో, ఇంగ్లాండ్‌తో 4-0 తేడాతో వరుసగా రెండు టీ20 సిరీస్‌లను కోల్పోయింది. ఓపెనింగ్ స్థానాల కోసం సంజు శాంసన్(Sanju Samson), వైభవ్ సూర్యవంశీలను హడావుడిగా మార్చడం, వాషింగ్టన్ సుందర్(Washington Sundar), తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి కీలక ఆటగాళ్ల ఫామ్ క్షీణించడం జట్టును దెబ్బతీసింది.
భారత బ్యాటర్లు ఫ్లాట్ పిచ్‌లపై ఆడి చెడిపోతున్నారనే విమర్శలపై గవాస్కర్ తన శైలిలో స్పందించారు. ఐపీఎల్‌లోని ఫ్లాట్ పిచ్‌లపై కూడా మన బ్యాటర్లు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడ్డారని, ఇది పూర్తిగా వారి సాంకేతిక లోపమని ఆయన విశ్లేషించారు. ఫ్రంట్ ఫుట్ మీద బరువు వేసి, బ్యాక్ ఫుట్‌ను లాక్ చేయడం వల్ల ఫేస్ వైపు వచ్చే బంతిని డిఫెండ్ చేయడానికి వీలుగా బరువును బదిలీ చేయలేకపోతున్నారని సాంకేతిక లోపాన్ని ఎత్తిచూపారు.
దేశీయ టీ20 మ్యాచ్‌లలో బౌండరీల పొడవు తక్కువగా ఉండటం కూడా బ్యాటర్ల వైఫల్యానికి కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లేదా డొమెస్టిక్ మ్యాచ్‌లలో కొట్టే సిక్సర్లు కేవలం బౌండరీ లైన్‌ను దాటుతాయని, అదే వేరే పెద్ద గ్రౌండ్స్‌లో అయితే అవి క్యాచులుగా మారుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సౌతాఫ్రికాలోని వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై వన్డే టైటిల్‌ను తిరిగి సాధించాలంటే, భారతదేశంలోని ప్రతీ మైదానంలో బౌండరీల పొడవును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.








