పెద్ద వాళ్లు ఫోన్ వాడకం ప్రమాదమా? స్టడీ చెప్పిన షాకింగ్ నిజం!!
“ఈ వయసులో ఎందుకమ్మా ఆ స్మార్ట్ఫోన్?”
మన ఇళ్లలో పెద్దవాళ్ల చేతిలో మొబైల్ కనిపిస్తే వినిపించే మొదటి మాట ఇదే.
“రోజంతా వాట్సాప్ చూస్తున్నారు…”
“యూట్యూబ్లో ఏవో వీడియోలు చూస్తున్నారు…”
“ఫోన్ ఎక్కువగా వాడితే మెదడు పాడవుతుంది…”
అని వాళ్లకంటే మనమే ఎక్కువగా భయపడతాం.
అందుకే చాలా మంది తమ అమ్మానాన్నలకు స్మార్ట్ఫోన్ ఇచ్చినా… “ఎక్కువగా వాడొద్దు” అని హెచ్చరిస్తుంటారు. కానీ…
ఇన్నాళ్లూ మనం చెబుతున్న ఈ సలహా పూర్తిగా సరైనదేనా?
ప్రపంచవ్యాప్తంగా 57 పరిశోధనలను, 4.11 లక్షల మంది 50 ఏళ్లు పైబడిన వారిపై చేసిన ఒక భారీ విశ్లేషణ ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఆ అధ్యయనంలో కనిపించిన విషయం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
టెక్నాలజీని ఉపయోగించే పెద్దవారిలో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) ప్రమాదం… ఉపయోగించని వారితో పోలిస్తే 58 శాతం వరకు తక్కువగా నమోదైంది.
అంతే కాదు…
కాలక్రమేణా జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గే వేగం కూడా 26 నుంచి 34 శాతం వరకు తక్కువగా కనిపించింది.
ఈ ఫలితాలు అమెరికాలోని బేలర్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ పరిశోధకులు చేసిన విశ్లేషణలో వెలువడ్డాయి.
డిమెన్షియా (Dementia) అంటే ఏమిటి?
డిమెన్షియా అంటే వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గిపోవడం. ప్రతి సాధారణ మతిమరుపు డిమెన్షియా కాదు, కానీ ఇది రోజువారీ జీవితాన్ని దెబ్బతీసే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి.
అసలు ఫోన్ ఎలా మెదడుకు ఉపయోగపడుతుంది?
ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఒకటే.
“ఫోన్ అంటే రీల్స్…”
“ఫోన్ అంటే టైమ్ పాస్…”
అనుకుంటారు.
కానీ పరిశోధకులు చెప్పేది అది కాదు. ఒక కొత్త యాప్ నేర్చుకోవడం… WhatsAppలో మెసేజ్ పంపడం… వీడియో కాల్ చేయడం… Google Maps చూసి దారి తెలుసుకోవడం… Google Payతో బిల్లు చెల్లించడం…
మందుల కోసం రిమైండర్ పెట్టుకోవడం… ఇవన్నీ మెదడును ఆలోచించేలా, గుర్తుంచుకునేలా, నిర్ణయాలు తీసుకునేలా చేసే చిన్న చిన్న మానసిక కార్యకలాపాలు.
ఇవి కూడా చదవండి
అంటే…
జిమ్లో శరీరానికి వ్యాయామం చేసినట్టు… ఇవి మెదడును కూడా యాక్టివ్గా ఉంచడంలో సహాయపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
మన తెలుగు ఇళ్లలోనే దీని ఉదాహరణ కనిపిస్తుంది
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకుతో… ప్రతిరోజూ ఐదు నిమిషాలు వీడియో కాల్ మాట్లాడే అమ్మలు చాలా మంది కనపడతారు. ఆమె కేవలం కొడుకుతో మాట్లాడటం మాత్రమే కాదు. కాల్ చేయడం… మాట్లాడటం… మనవళ్ల ఫోటోలు చూడటం…వాయిస్ మెసేజ్ పంపడం…ఇలా ఎన్నో మానసిక కార్యకలాపాల్లో పాల్గొంటోంది. అదే సమయంలో…ఒంటరితనం కూడా కొంత తగ్గుతుంది.
ఇది ఎందుకు ముఖ్యమంటే…డిమెన్షియా ప్రమాదాన్ని పెంచే అంశాల్లో సామాజిక ఒంటరితనం కూడా ఒకటి అని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి.
అయితే… ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి
ఈ అధ్యయనం…
“రోజంతా రీల్స్ చూడండి…”
“ఎంత ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటే అంత మంచిది…”
అని ఎక్కడా చెప్పలేదు.
అలాగే…ఫోన్ వాడితే డిమెన్షియా రాదని కూడా నిరూపించలేదు. ఈ పరిశోధనలో కనిపించింది ఒక్కటే. టెక్నాలజీని ఉపయోగించే పెద్దవారిలో డిమెన్షియా ప్రమాదం తక్కువగా నమోదైంది. ఎందుకు అలా జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలే చెబుతున్నారు.
పరిశోధకులు కుటుంబాలకు ఇచ్చిన చిన్న సలహా
మీ ఇంట్లో అమ్మానాన్నలు…తాతయ్య, నానమ్మ… స్మార్ట్ఫోన్కు దూరంగా ఉంటే…వారిని అలాగే వదిలేయొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.
మొదట ఫోటోలు చూడటం నేర్పించండి.
తర్వాత వీడియో కాల్. ఆ తర్వాత మెసేజింగ్.
క్యాలెండర్. రిమైండర్లు. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టమని వారు చెబుతున్నారు.
కాబట్టి…
“మా నాన్నకు స్మార్ట్ఫోన్ ఎందుకు?”
“అమ్మకు వాట్సాప్ నేర్పి ఏం లాభం?”
“వాళ్లకు ఈ టెక్నాలజీ రాదు.”
అనే ఆలోచన వదిలెయ్యండి.
ఇప్పుడు స్టడీ చెబుతోంది…
అదే వాళ్ల మెదడుకు వ్యాయామం కావచ్చు.
ఇక నుంచి మీ అమ్మానాన్నలు ఫోన్ పట్టుకుంటే…వెంటనే… ఫోన్ను వాళ్ల చేతిలో నుంచి తీసేయడం కంటే… దాన్ని మరింత ఉపయోగపడేలా ఎలా వాడాలో నేర్పించడం విలువైన పని కావచ్చు.








