ఒక్క ప్రశ్నతో Hollywood కు షాక్ ఇచ్చిన AI కంపెనీ!!కోర్టులో బిగ్ ట్విస్ట్!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
సాధారణంగా మన దగ్గర సినిమా రిలీజ్ అయిన రెండో రోజే…
“పైరసీ వల్ల నష్టపోయాం” అని నిర్మాతలు చెబుతుంటారు.
కానీ…అదే సమయంలో “మీరు మాత్రం ఎప్పుడూ పైరసీ కంటెంట్ చూడలేదా?” అని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే? ఆ నిర్మాత ఏం చెప్పగలరు?
ఇప్పుడు అమెరికాలో దాదాపు ఇలాంటి పరిస్థితినే ఒక AI కంపెనీ హాలీవుడ్‌కు తీసుకొచ్చింది.
హాలీవుడ్ vs AI
ఒకవైపు AI సహాయంతో పోస్టర్లు, కాన్సెప్ట్ ఆర్ట్, స్టోరీబోర్డులు తయారు చేస్తున్నారనే చర్చ… మరోవైపు అదే AI కంపెనీలపై “మా కాపీరైట్ దొంగిలించారు” అంటూ భారీ కేసులు. ఇప్పుడు ఈ విరుద్ధతనే ఆయుధంగా మార్చుకుని ప్రముఖ AI సంస్థ Midjourney హాలీవుడ్ దిగ్గజాలైన Disney, Warner Bros., Universal స్టూడియోలకు కోర్టులో షాకింగ్ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
Midjourney అంటే ఏమిటి?
ChatGPT టెక్స్ట్ రాస్తే… Midjourney ఫోటోలు తయారు చేస్తుంది. మీరు కొన్ని పదాలతో ఒక వివరణ (Prompt) ఇస్తే చాలు, దానికి తగ్గట్టుగా సెకన్లలోనే కొత్త చిత్రాలను సృష్టించే ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన AI ఇమేజ్ జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది ఒకటి.
కేసు ఎలా మొదలైంది?
గతేడాది Disney, Universal సంస్థలు Midjourneyపై అమెరికా కోర్టులో కేసు వేశాయి. తర్వాత Warner Bros. కూడా ఈ న్యాయపోరాటంలో చేరింది. Bart Simpson, Darth Vader వంటి కాపీరైట్ ఉన్న పాత్రల చిత్రాలను Midjourney రూపొందిస్తోందని, తమ అనుమతి లేకుండానే కాపీరైట్ కంటెంట్‌తో AI మోడళ్లకు శిక్షణ ఇచ్చిందని స్టూడియోలు ఆరోపించాయి.
Midjourney కౌంటర్ అటాక్
కోర్టులో Midjourney ఒక్క ప్రశ్నతో మొత్తం కేసునే మరో దారిలోకి తిప్పేసింది.
“ముందు… మీరు AIని ఎలా వాడుతున్నారో,అసలు వాడుతున్నారో లేదో చెప్పండి. మీరు కూడా AIతో సినిమాలు రూపొందిస్తున్నారని తేలితే… మాపై వేసిన కాపీరైట్ కేసు నిలబడుతుందా?” అని అడిగింది.
అలాగే కాపీరైట్ ఉన్న కంటెంట్‌పై తమ AI మోడళ్లకు శిక్షణ (Training) ఇవ్వడం అనేది ‘ఫేర్ యూస్’ (Fair Use) పరిధిలోకి వస్తుందని మిడ్‌జర్నీ వాదిస్తోంది.
స్టూడియోలపై డిమాండ్లు
స్టూడియోలు తెర వెనుక AIని ఎలా ఉపయోగిస్తున్నాయి? దానికి సంబంధించిన అంతర్గత పత్రాలన్నింటినీ బయటపెట్టాలని Midjourney కోరుతోంది. అంతేకాదు… స్టూడియోలు Midjourney ప్లాట్‌ఫారమ్‌లో ఇచ్చిన అన్ని Prompts, వాటికి వచ్చిన AI చిత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేసింది. కేవలం కాపీరైట్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తున్న చిత్రాలు మాత్రమే కాదు, వారు చేసిన మొత్తం వినియోగ వివరాలు ఇవ్వాలని కోరుతోంది.
వ్యూహం ఏమిటి?
Midjourney ఇలా అడగడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది.
ఒకవేళ Disney, Warner Bros., Universal వంటి స్టూడియోలు తమ సినిమాల కోసం Storyboarding, Concept Art, Character Design, Content Ideation వంటి పనుల్లో AIని ఉపయోగిస్తున్నట్టు తేలితే… కాపీరైట్ ఉన్న కంటెంట్ ఆధారంగా AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం పరిశ్రమలోనే సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ అని కోర్టులో వాదించే అవకాశం Midjourneyకి లభిస్తుంది.
కేసులో కీలక ప్రశ్నలు
అంటే ఇప్పటి వరకు కేసులో ఉన్న ప్రశ్న…
“Midjourney కాపీరైట్ కంటెంట్‌తో AIకి శిక్షణ ఇచ్చిందా?”
అనేదైతే… ఇప్పుడు మరో కీలకమైన ప్రశ్న కూడా చేరింది. “అసలు హాలీవుడ్ స్టూడియోలే AIని ఎంతవరకు వాడుతున్నాయి?” అనేది.
కేసు దిశ మారుతుందా?
ఒకవేళ స్టూడియోలు కూడా ఇలాంటి విధంగానే AIని ఉపయోగిస్తున్నట్టు బయటపడితే… ఈ కేసు మొత్తం దిశే మారిపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
స్టూడియోలు ఏమంటున్నాయి?
అయితే Midjourney డిమాండ్‌ను స్టూడియోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమాచారం మొత్తం కేసుకు సంబంధం లేనిదని, Midjourney అనవసరంగా వివరాలు అడుగుతోందని వాటి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
స్టూడియోల ప్రధాన న్యాయవాది డేవిడ్ సింగర్ మాట్లాడుతూ.. మిడ్‌జర్నీ చేస్తున్నది “చేపల వేట” (Fishing Expedition – కావాలనే ఏదో ఒక సాక్ష్యం దొరక్కపోతుందా అని వెతకడం) లాంటిదని, ఆ వివరాలకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు.
తామేమీ AI సాంకేతికతను ఆపడానికో లేదా మిడ్‌జర్నీని మూసివేయడానికో ప్రయత్నించట్లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా, తమ ఐకానిక్ క్యారెక్టర్లను, సినిమాలను కాపీ కొట్టడం, పంపిణీ చేయడం ఆపడమే తమ ఉద్దేశమని చెప్పారు.
ఈ కేసు ప్రభావం
ఈ కేసు కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాదు. రేపు ChatGPT, Gemini, Midjourney వంటి AIలు ఇంటర్నెట్లోని కంటెంట్‌ను ఎలా ఉపయోగించాలి? కాపీరైట్ హద్దులు ఎక్కడివరకు ఉండాలి? AIతో పనిచేస్తున్న క్రియేటర్లకు ఎలాంటి నిబంధనలు వర్తించాలి? వంటి కీలక ప్రశ్నలకు ఈ కేసు భవిష్యత్తులో మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.
అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, సినిమా పరిశ్రమ, కంటెంట్ క్రియేటర్లు ఈ కేసుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏదైమైనా… ఈ కేసులో Midjourney గెలుస్తుందా… Hollywood గెలుస్తుందా… అనేదే కాదు.
ఇతరులను తప్పుబట్టే ముందు… మనం చేస్తున్నది కూడా అదేనా? అనే ఒక్క ప్రశ్నకు కోర్టు సమాధానం వెతుకుతోంది.
ఆ సమాధానమే… AI భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.








