తెలుగు రాష్ట్రాల మంత్రులకు పరోక్ష విజయ్ కౌంటర్..?
తమిళనాడు రెండో కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) మంత్రులకు జారీ చేసిన ఒక కీలక ఆదేశం ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి సహా పలు కీలక అంశాలపై ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్న విజయ్.. తాజాగా.. మంత్రులు ఎవరూ ప్రచార ఆర్భాటాలు, తనిఖీల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లకూడదని కఠిన నిబంధన పెట్టడం.. ఒకరకంగా తెలుగు రాష్ట్రాల మంత్రులను ఉద్దేశించి చేసిన పరోక్ష కౌంటర్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మంత్రులు నిరంతరం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు (Surprise Visits) చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంపై అధికారులను నిలదీయడం, విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లడం మంచిదే అయినప్పటికీ, అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా మారుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ తన మంత్రులకు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం గమనార్హం. మంత్రులు క్షేత్రస్థాయి తనిఖీల పేరుతో విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, తమ శాఖలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు, వ్యవస్థాగత సంస్కరణలపైనే పూర్తి దృష్టి పెట్టాలని విజయ్ భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ తనిఖీలు చేయడానికి, లోపాలను సరిదిద్దడానికి అధికారుల యంత్రాంగం ఉందని, మంత్రులు ప్రచార ఆర్భాటాలకు వెళ్తే పాలన కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల స్కూల్ విజిట్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో, విజయ్ దానికి భిన్నంగా తీసుకున్న ఈ స్టాండ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.








