మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోట ఆత్మహత్య మాట…
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ ఉద్వేగభరిత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకంలో రాసుకొచ్చారు. ఖురేషీ తాజాగా రాసిన ‘ఇండియా అండ్ ఐ.. ఎ హండ్రెడ్ మెమొరీస్, నాట్ ఎ మెమోయిర్’ (India and I: A Hundred Memories, Not a Memoir) అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ పుస్తకం జులై 16న మార్కెట్లోకి రాబోతోంది.
ఈ పుస్తకం ప్రకారం జనవరి 2012 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నడుస్తోంది. ఈ ప్రచార సమయంలో అప్పటి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాల్లో 4.5 శాతం నుంచి 9 శాతానికి కోటా పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వుందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ దీనిపై నాలుగు రోజుల పాటు విచారణ జరిపింది.
కాంగ్రెస్ పక్షాన సింఘ్వీ, బీజేపీ పక్షాన అరుణ్ జైట్లీ వాదించారని ఖురేషీ పేర్కొన్నారు. చివరికి ఖుర్షీద్ ను ఈసీ తప్పుబట్టిందని, కోడ్ ప్రకారం చేయగలిగిన బలమైన చర్య అదే అని రాసుకొచ్చారు. అయితే దీనిపై కాంగ్రెస్ లో కొందరు ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈసీ అహంకారంగా వుందని, ఏకపక్షంగా వుందని మండిపడ్డారు.
‘మరుసటి రోజే పీఎంఓ అత్యవసర ఫోన్ (RAX) మోగింది. ప్రధాని మీతో అర్జంట్‌గా మాట్లాడాలన్నారు. మన్మోహన్ సింగ్ లైన్లోకి వచ్చి.. ‘ఖురేషీ జీ, నేను మిమ్మల్ని అత్యవసరంగా కలవవచ్చా?’ అని చాలా ఆందోళనతో అడిగారు. ఆయన ప్రోటోకాల్ పక్కనబెట్టి నా వద్దకే వచ్చేలా మాట్లాడటంతో.. ‘సార్, మీరే ప్రధానమంత్రి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే నేను వస్తాను’ అని చెప్పి ఆ సాయంత్రం 7 గంటలకు పీఎం నివాసంలో సమావేశం ఖరారు చేసుకున్నా.’ అని మాజీ సీఈసీ ఎస్.వై. ఖురేషీ తన పుస్తకంలో పేర్కొన్నారు.
సమావేశం కాగానే మన్మోహన్ సింగ్ గొంతు తీవ్ర ఆవేదనతో వణికిపోయిందని ఖురేషీ గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు చెప్పిన విషయాలన్నీ హరీష్ నాకు చెప్పాడు. నువ్వు కూడా నా గురించి అలాగే భావిస్తుంటే.. నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అని మన్మోహన్ అనడంతో ఖురేషీ నోట మాట రాలేదు.
తాను కేవలం కొందరు మంత్రుల ప్రవర్తన గురించే అన్నానని, ప్రధాని వైఖరిని ఎప్పుడూ శంకించలేదని చెప్పి ఆయనను శాంతింపజేయడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. అప్పుడు మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. ‘నాకు ఈ విషయమే తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే వారిని తీవ్రంగా మందలించేవాడిని. ఇకపై మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి’ అని హామీ ఇచ్చారు’’ అని ఖుర్షేదీ తన పుస్తకంలో రాసుకొచ్చారు.








