అయోధ్య ట్రస్ట్ సీఈవో పదవికి దరఖాస్తుల ఆహ్వానం… లభించే సౌకర్యాలు, అర్హతలివే..
అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్య నిర్వాహక అధికారి (సీఈవో) పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది ట్రస్ట్. ఆలయ దైనందిన నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు ఈ నియామకాన్ని చేపట్టింది. దరఖాస్తుల స్వీకరణకు జూలై 18 సాయంత్రం 4 గంటల వరకూ గడువు నిర్ణయించారు.
అర్హతలు ఏంటంటే…
ఈ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వుండాలి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రముఖ సంస్థల్లో కనీసం 20 సంవత్సరాల పరిపాలనా అనుభవం వుండాలి. అలాగే గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి వుండాలి. హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు తప్పనిసరి అని ట్రస్ట్ అందులో పేర్కొంది. అలాగే సనాతన హిందూ సంప్రదాయాలను పాటించే అభ్యర్థులకు, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయం వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
సీఈవో బాధ్యతలివే…
అయితే.. సీఈవో బాధ్యతలు కేవలం పరిపాలనా పరమైనవే కావు. ప్రతి రోజూ లక్షలాది భక్తులు వస్తుంటారు. వారికి దర్శన ఏర్పాట్లు చేయడం, భద్రతా చర్యలు, ట్రస్ట్ నిధులు, కానుకల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల సమన్వయం వంటి కీలక బాధ్యతలను చూసుకోవాల్సి వుంటుంది.
సీఈఓకు లభించే సౌకర్యాలివే..
ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు లేదా ప్రముఖ సంస్థల సీఈఓలకు లభించే సమానమైన జీతభత్యాలే ఈయనకూ వుంటాయి. అలాగే అయోధ్యలో సౌకర్యాలు కల్పిస్తారు. అధికారిక వాహనాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది, వైద్య బీమా, ప్రయాణ జీత భత్యాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా ట్రస్ట్ అందిస్తుంది.








