లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీకి చేదు అనుభవం..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి(Virat Kohli) లండన్ వీధుల్లో ఒక వింతైన, కలవరపరిచే అనుభవం ఎదురైంది. గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న కోహ్లీ.. గత నెలలో లండన్‌లో తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సహచరుడు, ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌ను రహస్యంగా కలుసుకున్నారు. అయితే, ఈ భేటీని చాలా లో-ప్రొఫైల్‌గా ఉంచాలని వారు ప్రయత్నించినప్పటికీ, ఎవరో తెలియకుండా తీసిన వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై జోర్డాన్ కాక్స్ స్పందిస్తూ ది గార్డియన్‌తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “కోహ్లీకి ఎంతో బాధ కలిగించే విషయం ఏంటంటే.. అతనికి తెలియకుండానే జనాలు వెనుక ఫాలో అవుతుంటారు. మేము లండన్ వీధిలో కలుసుకున్నప్పుడు వందలాది మంది మా పక్కనుంచే వెళ్లారు, ఎవరూ ఆగలేదు, మాతో మాట్లాడలేదు. కానీ, మేము విడిపోయిన రెండు గంటల తర్వాత కోహ్లీ నాకు మెసేజ్ చేసి.. ‘ఈ ఫోటోలు చూశావా?’ అని అడిగాడు. అది చూసి నేను షాక్ అయ్యాను” అని కాక్స్ పేర్కొన్నారు.
స్టార్డమ్ వల్ల విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో కాక్స్ వివరించారు. కోహ్లీ అందరిలాగే చాలా నార్మల్ లైఫ్ గడపాలని, బయట తిరుగుతూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారని, కానీ దురదృష్టవశాత్తు అది ఎల్లప్పుడూ సాధ్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విరాట్ లాంటి దిగ్గజ ఆటగాడితో కాసేపు సమయం గడపాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడటంలో తప్పు లేకపోయినా, వారి వ్యక్తిగత గోప్యతకు (Privacy) భంగం కలిగించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని కాక్స్ కొనియాడారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడుతున్నప్పుడు కోహ్లీ తనకు ఎంతో మార్గదర్శకత్వం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఎంతో సాధించిన ఒక గొప్ప క్రికెటర్ అయి ఉండి కూడా, తోటి ఆటగాళ్లకు సమయం కేటాయించడం, తనకంటే ముందు ఇతరులకు సహాయం చేయాలని అనుకోవడం చాలా అరుదైన విషయమని విరాట్ పై ప్రశంసలు కురిపించారు. కాగా, గాయం వల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు దూరమైన కోహ్లీ, జులై 14న బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి వన్డే ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు.








