ఎంఐఎం కోసం రేవంత్ సర్కార్ రూల్స్ మార్చేసిందా?
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే వినిపించిన ‘చట్టం ఎవరికైనా ఒక్కటే’ అనే నినాదం ఇప్పుడు పాతబస్తీ సల్కం చెరువు సాక్షిగా అభాసుపాలవుతోంది. పేదల ఇళ్లు, సామాన్య బిల్డర్ల భవనాలపై బుల్డోజర్లతో విరుచుకుపడే ‘హైడ్రా’ కన్ను, మిత్రపక్షమైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన విద్యాసంస్థల దగ్గరకు వచ్చేసరికి మూతపడిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడ ఖల్సాలోని సల్కం చెరువు పరిధిలో ఉన్న బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తీసుకున్న అనూహ్యమైన యూ-టర్న్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం రాజకీయ ప్రయోజనాల కోసం నిబంధనలను ఎలా తుంగలో తొక్కిందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
సల్కం చెరువు ఆక్రమణలపై అడ్వకేట్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ వెనుక సుదీర్ఘ పొలిటికల్ అండ్ లీగల్ డ్రామా దాగి ఉంది. 2016 లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాథమిక సర్వే నోటిఫికేషన్ ప్రకారం.. సల్కం చెరువు వైశాల్యం దాదాపు 36 ఎకరాల ప్రభుత్వ భూమి. అప్పట్లో అధికారికంగా విడుదల చేసిన మ్యాపులు ఈ ఒవైసీ విద్యాసంస్థల భవనాలు స్పష్టంగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్లు తేల్చిచెప్పాయి.
కానీ, తాజా విచారణలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు సమర్పించిన మెమో చూసి స్వయంగా హైకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విద్యాసంస్థలు అసలు ట్యాంక్ బెడ్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలోనే లేవంటూ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం, మిషన్ కాకతీయ కింద చెరువు చుట్టూ రింగ్ బండ్ నిర్మించామని చెప్పడం ప్రభుత్వ ద్వంద్వ నీతిని బట్టబయలు చేసింది. 2016 నాటి నోటిఫికేషన్‌కు భిన్నంగా ఇప్పుడు చెరువు వైశాల్యం ఎలా కుంచించుకుపోయింది? రాజకీయ ఒత్తిళ్లతో ఎఫ్టీఎల్ సరిహద్దులను మార్చడానికి గల కారణాలేంటని ప్రశ్నిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా శాఖలను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం నిలదీయడం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎంఐఎం పార్టీతో అంతర్గతంగా నడుపుతున్న ఫ్రెండ్లీ బంధాన్ని కాపాడుకోవడానికే ఈ డిఫెన్సివ్ స్టాండ్ తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం పరోక్ష మద్దతు ఇస్తుండటంతో, పాతబస్తీ పెద్దలను నొప్పించకుండా ఉండేందుకు అధికారులు రీ-సర్వేల పేరుతో కాలయాపన చేసి, చివరకు నివేదికలనే మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఎంతటివారైనా సరే.. చెరువులను ఆక్రమిస్తే వదిలేది లేదు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి బిల్డప్ ఇచ్చిన హైడ్రా బ్రాండ్ ఇమేజ్‌కు ఈ సల్కం చెరువు వ్యవహారం పెద్ద మచ్చగా మారింది. చట్టం అందరికీ ఒక్కటే అన్న సూత్రం అధికార పక్ష రాజకీయ అవసరాలకు లోబడి ఎలా మారిపోతుందో ఈ కేసు రుజువు చేస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ పక్షపాత నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులకు ఉచిత కంటి పరీక్షలు చేయించాలని ఎద్దేవా చేశారు. ఓవైసీ కాలేజీ చెరువులోనే ఉందన్న విషయం ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చడానికి వేగంగా వచ్చే హైడ్రా, మిత్రపక్షం అక్రమ నిర్మాణాల దగ్గరకు వచ్చేసరికి వెనకడుగు వేస్తోందన్నారు. కాంగ్రెస్ రాజకీయ రంగోలీ వేసిన ప్రతిచోటా ఎఫ్టీఎల్ లైన్లు మాయాజాలంతో మారిపోతాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
ప్రభుత్వం ఓవైసీ విద్యాసంస్థలను కాపాడటానికి ఎన్ని ప్రహసనాలు ఆడినా, న్యాయస్థానం మాత్రం ఈ కేసును తేలికగా వదిలేలా లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలేజీకి అసలు అనుమతులు లేవని ఒకసారి, కేవలం ఇతర విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారని మరోసారి పరస్పర విరుద్ధ సమాధానాలు చెప్పడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణం, సహజ వనరుల రక్షణ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ, అన్ని శాఖలు 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ నిబంధనలను తుంగలో తొక్కినా.. న్యాయస్థానం పర్యవేక్షణలో సల్కం చెరువు ఆక్రమణల నిజాలు త్వరలోనే పూర్తిగా బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.








