స్పెయిన్ తో సంబంధాలు కట్.. మరోసారి ట్రంప్ దూకుడు నిర్ణయం..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన దూకుడు నిర్ణయాలను ప్రకటించారు. టర్కీ రాజధాని అంకారాలో నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్… నాటో కూటమిలో భాగస్వామిగా ఉన్న స్పెయిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పెయిన్ ఒక “అత్యంత దారుణమైన భాగస్వామి” అని అభివర్ణిస్తూ, ఆ దేశంతో ఉన్న అన్ని రకాల వాణిజ్య, వర్తక సంబంధాలను తక్షణమే తెంచేసుకోవాలని, రెండు దేశాల మధ్య ప్రయాణాలను కూడా నిలిపివేయాలని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రుట్టె సమక్షంలోనే ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“స్పెయిన్ తో రిలేషన్స్ ఓ వేస్ట్ వ్యవహారమన్నారు ట్రంప్. ఆ దేశంతో ఇకపై ఎలాంటి వ్యాపారాలు వద్దు. నాటో కూటమి రక్షణ కోసం వారు సరైన నిధులు ఇవ్వరు, భాగస్వామ్యం పంచుకోరు. వారితో మాకేం సంబంధం లేదు, వెంటనే వాణిజ్యాన్ని నిలిపివేయండి. వాళ్లే మళ్లీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు, చూడండి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2035 నాటికి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ రంగానికి కేటాయించాలనే నాటో కొత్త నిబంధనకు ఒప్పుకోని ఏకైక దేశం స్పెయిన్ కావడమే ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణం. కాగా, నాటో చీఫ్ మార్క్ రుట్టె స్పెయిన్‌ను సమర్థిస్తూ.. ఆ దేశం రక్షణ బడ్జెట్‌ను 2 శాతానికి పెంచుతూ గతేడాది పెద్ద అడుగే వేసిందని ట్రంప్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఇరాన్-అమెరికా ఘర్షణల సమయంలో అమెరికా దాడులకు తమ వైమానిక రంగాన్ని కానీ, తమ పరిధిలోని సైనిక స్థావరాలను కానీ ఉపయోగించుకోవడానికి స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ నిరాకరించారు. అమెరికా ఏకపక్ష దాడుల వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందని ఆయన బహిరంగంగానే విమర్శించారు. నాటి నుండి వాషింగ్టన్, మాడ్రిడ్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సదస్సులోనే ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని, ఇరాన్ నాయకులు “అనారోగ్యకరమైన మనస్తత్వం ఉన్నవారు” అంటూ ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై స్పెయిన్ ప్రధాని కార్యాలయం శాంతంగానే స్పందించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, అమెరికాకు స్పెయిన్‌తో వాణిజ్య మిగులు ఉందని గుర్తుచేసింది. అంతేకాకుండా, యూరోపియన్ సమాఖ్య కస్టమ్స్ యూనియన్‌లో స్పెయిన్ భాగం కాబట్టి అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది.
అయితే, స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మోనికా గార్సియా మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “బెదిరింపులకు లొంగనందుకే ట్రంప్ మమ్మల్ని చెడ్డ భాగస్వామి అంటున్నారు. మాది సార్వభౌమాధికారం, శాంతిని నమ్మే ప్రజాస్వామ్య దేశం. దౌత్య నీతికి, రౌడీయిజానికి మధ్య తేడా తెలియకపోవడం చాలా దారుణం” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.








