మైమరిపించిన భవాని నృత్యాంజలి కళాక్షేత్రం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం భవాని’స్ నృత్యాంజలి కళాక్షేత్రం గురువు శ్రీమతి తొండపు భవాని గారి మార్గదర్శకత్వంలో శిష్యులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక నృత్యార్చన కార్యక్రమంలో శ్రీహిత, శ్లోక, వర్ణిక జి., ఆద్య, మౌక్తిక, ఎం. నందిత, ఈషా, రిద్ధి, అక్షయ, వైష్ణవి ప్రియ, ఎం. సాన్విక, ఆద్య ఎం., ఆశ్రిత తేజు, సాత్విక, ప్రణవ హర్షిణి, సాయి సాన్వి, సాన్వి పి., కె. ఖ్యాతి సహస్ర, హాషిక, పల్లవిత, ధన్య, సూర్య తేజస్విని సంయుక్తంగా “పుష్పాంజలి, బ్రహ్మాంజలి, భావములోన, దశావతారం, జతీశ్వరం, నారాయణతే, వినాయక కౌత్వం” అనే నృత్యాంశాలను భావ, లయ, అభినయ సమన్వయంతో అద్భుతంగా ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శిష్యుల నృత్య ప్రదర్శనలు భారతీయ శాస్త్రీయ నృత్య సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ సభకు భక్తిరసాన్ని పంచాయి.
ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గురువు శ్రీమతి తొండపు భవాని గారు తమ శిష్యులను
భక్తి, లయ, అభినయ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం అభినందనీయమని కొనియాడారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న కళాకారులందరికీ శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ మధురమైన ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.










