ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఆ సీన్… 35 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆ గదిలో మొత్తం 12 మంది ఉన్నారు.
11 మంది ఆమెను చూస్తున్నారు.
ఒక్క ఆమె మాత్రమే… అందరినీ చదువుతోంది.
టేబుల్ మీద సిగరెట్ పొగ నెమ్మదిగా పైకి ఎగురుతోంది.
రికార్డర్ తిరుగుతోంది.
“మీరు అతన్ని చంపారా?”
అని ఒక డిటెక్టివ్ అడుగుతున్నాడు.
ఆమె నవ్వుతోంది.
సమాధానం చెప్పడానికి తొందరపడం లేదు.
ఆమెకు తెలుసు…
ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ తన కథ వినడం లేదు.
తననే చూస్తున్నారు.
ఆమె నెమ్మదిగా కాళ్లు మార్చి కూర్చుంటుంది.
ఒక్క క్షణం.
గది మొత్తం నిశ్శబ్దం.
డిటెక్టివ్లు ప్రశ్నలు అడగడం మర్చిపోయారు.
ప్రేక్షకులు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు.
అది కేవలం ఒక సీన్ కాదు.
సినిమా చరిత్రలో… కెమెరా, సస్పెన్స్, సెడక్షన్, పవర్ అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో ఎలా కలుస్తాయో చూపించిన మాస్టర్‌క్లాస్.
ఆ సీన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమా అభిమానులకు ఇప్పటికీ ఈ ఒక్క ఫ్రేమ్ చాలు.
‘బేసిక్ ఇన్స్టింక్ట్’.
1992లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్ట్ క్లాసిక్.. తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో ఈ సినిమా గురించి పెద్ద చర్చే జరిగింది. షారన్ స్టోన్ పోషించిన కేథరిన్ ట్రామెల్ పాత్ర పాప్ కల్చర్‌లో ఒక ఐకాన్‌గా మారిపోయింది.ఇప్పుడు దాదాపు 35 ఏళ్ల తర్వాత, అదే సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఒరిజినల్ రచయిత జో ఎస్టర్హాస్ స్క్రిప్ట్ పూర్తి చేశాడు.
కానీ… “ఈసారి ఆయన తిరిగి వస్తున్నది ఒక రీబూట్ కోసం మాత్రమే కాదు. ‘బేసిక్ ఇన్స్టింక్ట్కు జరిగిన అతిపెద్ద తప్పును సరిదిద్దడానికి.’
“ఏంటి ఆ తప్పు?
ఆ తప్పు… 2006లో జరిగింది. దాని పేరు ‘బేసిక్ ఇన్స్టింక్ట్ 2’. ఒరిజినల్ సినిమాలో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ధైర్యం… పాత్రల మధ్య ఉన్న మైండ్ గేమ్. సెక్సువాలిటీ, సస్పెన్స్, వ్యంగ్యం… అన్నీ పక్కనపెట్టి, దాన్ని ఒక సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాగా మార్చేశారు.
ఇప్పుడు…
ఆ ఫ్లాప్‌కు అసలు కారణం అదే అని చెబుతున్న ఒరిజినల్ రచయిత జో ఎస్టర్హాస్… “ఈసారి ప్రేక్షకులు ప్రేమించిన అసలు ‘బేసిక్ ఇన్స్టింక్ట్’నే తిరిగి తీసుకొస్తున్నాను” అంటున్నారు.
‘బేసిక్ ఇన్స్టింక్ట్ 2’… ఫ్రాంచైజీని కూల్చేసిన సీక్వెల్?
‘బేసిక్ ఇన్స్టింక్ట్ 2’ పై ఇప్పుడు రచయిత జో ఎస్టర్హాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఆ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండేందుకు 15 లక్షల డాలర్లు ఇచ్చారు. వాళ్లు అసలు సినిమా చేసినంత ధైర్యంగా చేయలేదు. వివాదాలకు దూరంగా ఉండాలని చూసారు. చివరకు ‘బేసిక్ ఇన్స్టింక్ట్’ను ఒక సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాగా మార్చేశారు” అని ఆయన అన్నారు.
ఆ మాటలకు బాక్సాఫీస్ కూడా సాక్ష్యమే. 1992లో వచ్చిన ఒరిజినల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 352 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అదే 2006 సీక్వెల్ మాత్రం కేవలం 38 మిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయింది.
ఇప్పుడు మళ్లీ అసలు గేమ్ మొదలవుతుందా?
ఇప్పటికే అమెజాన్ MGM స్టూడియోస్ కోసం కొత్త రీబూట్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు జో ఎస్టర్హాస్ వెల్లడించారు. ఈసారి అభిమానులను మరింత ఉత్సాహపరిచే విషయం ఏమిటంటే… కేథరిన్ ట్రామెల్ మళ్లీ వస్తోంది. అంతేకాదు… ఆమె కుమార్తె ‘జెజిబెల్’ అనే కొత్త పాత్రను కూడా కథలోకి తీసుకొచ్చారు.
“స్క్రిప్ట్ పూర్తయింది. ఇది ప్రేక్షకులకు సరదాగా, థ్రిల్లింగ్‌గా ఉండాలి అనేదే నా లక్ష్యం. అయితే కథ గురించి ఇప్పుడే అంతా చెప్పలేను” అని ఎస్టర్హాస్ చెప్పారు.
షారన్ స్టోన్ కూడా వార్నింగ్ ఇచ్చింది
రీబూట్ గురించి గతంలో స్పందించిన షారన్ స్టోన్ కూడా తనదైన శైలిలో స్పందించింది. “2006లో వచ్చిన సినిమా లాగానే దీన్ని తీయాలనుకుంటే మాత్రం అనవసరం… అయినా సరే… గుడ్ లక్!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
ఆ ఒక్క వ్యాఖ్యే అభిమానుల్లో చర్చకు దారితీసింది.
ఈ రీబూట్పై ఎందుకు అంత ఆసక్తి?
ఇది కేవలం మరో రీమేక్ కాదు. హాలీవుడ్లో అత్యంత వివాదాస్పదమైన థ్రిల్లర్లలో ఒకటైన ‘బేసిక్ ఇన్స్టింక్ట్’ ను తిరిగి బతికించే ప్రయత్నం. అది కూడా… ఆ సినిమాను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన రచయితే స్వయంగా స్క్రిప్ట్ రాయడం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బలం.
ఏదైమైనా
కొన్ని సినిమాలు విడుదలవుతాయి.
కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.
కానీ… కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ బయటకు పోవు.
‘బేసిక్ ఇన్స్టింక్ట్’ మూడో రకానికి చెందిన సినిమా.
అందుకే… 35 ఏళ్ల తర్వాత కూడా దాన్ని మళ్లీ తీయడం ఒక సాహసం.
ఎందుకంటే…
ఒక కల్ట్ క్లాసిక్‌ను మళ్లీ నిర్మించడం కంటే కష్టం…
ప్రేక్షకుల జ్ఞాపకాలను మళ్లీ గెలవడం.
కాబట్టి…
ఈసారి ప్రశ్న
కేథరిన్ ట్రామెల్ పాత్ర తిరిగి వస్తోందా? కాదు.
35 ఏళ్లుగా ప్రేక్షకుల మనసులో బతికున్న ఆ మ్యాజిక్… నిజంగానే తిరిగి వస్తుందా?








