అలా చేస్తే .. భద్రాచలం మునిగిపోతుంది : మంత్రి ఉత్తమ్
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వ్యాఖ్యానించారు. అధిక శాతం లోన్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకుల లాభం కోసం కాళేశ్వరం కట్టారు తప్ప, తెలంగాణ ప్రజల కోసం కాదని చెప్పుకొచ్చారు. రూ.1.81లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కట్టింది కేసీఆర్ హయాంలోనే. కూలిపోయింది వాళ్ల హయాంలోనే అని ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చారని ప్రస్తావించారు.
నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ ( Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ఇలానే కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు నివేదిక ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసినప్పుడు కూలిపోతే కింద ఉన్న 40 ఊర్లు, భద్రాచలం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టకుండా తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. లేకపోతే ఎప్పుడో ఉత్తర తెలంగాణ సస్యశామలం అయ్యేదని వివరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గులాబీ పార్టీనే అని ఆగ్రహించారు. కాంగ్రెస్‌కి మంచి పేరు వస్తుందనే కారణంతో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకి డిజైన్ మార్చారని అన్నారు.








