నాగబంధంలో ఇప్పటివరకూ చేయని స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను – నభా నటేష్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నాగబంధంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. ఇందులో నేను పార్వతి పాత్రలో కనిపిస్తాను. తను ఒక వేద విద్యార్థిని. తన పాత్ర ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర చూసి ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు.
ఇందులో చాలా గ్రాండ్‌గా చిత్రీకరించిన డాన్స్ నంబర్ ఉంది కదా… దాని గురించి చెప్పండి?
-ఆ పాట చేయడం నిజంగా అద్భుతమైన అనుభవం. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో ఆ పాటను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అందులో క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. నిజంగా ఆ పాట బిగ్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం.
-టెక్నికల్‌గా కూడా అంత పెద్ద కాన్వాస్‌పై ఆ పాటను చిత్రీకరించడం ఒక ఛాలెంజ్. అది కేవలం డాన్స్ సాంగ్ మాత్రమే కాదు… అందులో భక్తి భావం కూడా కనిపించాలని దర్శకుడు, కొరియోగ్రాఫర్‌కు ముందుగానే సూచించారు. ఆ పాట కోసం వేసిన సెట్ నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. బృందావనంలో గోపికలంతా కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ సెట్లో పాట చిత్రీకరణ సమయంలో కూడా అలాంటి అనుభూతే కలిగింది. ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా జరిగింది.
-ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ సెట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులను కూడా ఆ విజువల్స్ తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి.
డైరెక్టర్ అభిషేక్ నామా గారి గురించి?
-అభిషేక్ గారికి చాలా క్లియర్ విజన్ ఉంది. ఆయన ఈ కథను చాలా అద్భుతంగా ఊహించుకున్నారు. ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్… ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్‌గా డిజైన్ చేశారు.
-అభిషేక్ గారు కథ చెప్పినప్పుడే నేను మెస్మరైజ్ అయ్యాను. ఆయన ప్రతి సీన్‌కు స్టోరీబోర్డ్ సిద్ధం చేసుకున్నారు. ప్రతి పాత్ర యాక్షన్, రియాక్షన్లను ముందుగానే స్కెచ్ చేసి రెడీ చేశారు. ఆయన చేసిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అద్భుతం.షూటింగ్లో కూడా ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. నేను కూడా ప్రేక్షకుల్లాగే ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
-ఈ సినిమాలో నా పాత్ర కోసం రెడీ అవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ప్రతి కాస్ట్యూమ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఈ షూటింగ్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది.
-ఈ సినిమా కోసం దాదాపు పది భారీ సెట్లు వేశారు. ప్రతి సెట్ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి భారీ చిత్రంలో నటించడం ఒక నటిగా నాకు గొప్ప అనుభవం. నాగబంధంలో ‘నమోరే’ పాటతో పాటు మరో జానపద గీతం కూడా చేశాను. ఈ రెండు పాటలు కూడా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటాయి.
-అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా చాలా నియమనిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. అలాగే అక్కడ ఒక అర్చకుడిని నియమించి ప్రతిరోజూ పూజలు చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవాళ్లం.
ఇందులో మీ పాత్రలో రొమాన్స్ కూడా ఉంటుందా?
-రొమాన్స్ ఉంటుంది. అయితే దానికంటే చాలా ముఖ్యమైన అంశాలు నా పాత్రలో ఉంటాయి. అవే కథకు కీలక మలుపు తీసుకొస్తాయి. ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. కథకు బలం చేకూర్చే పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్ర ఇది. ఈ పాత్ర చేసినందుకు చాలా గర్వపడుతున్నాను.
నిర్మాతల గురించి?
తొలి సినిమానే అయినప్పటికీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో దాదాపు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతి విషయంలో రాజీ పడకుండా, కంటెంట్‌కు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దారు.
ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేశారు. అనంత పద్మనాభస్వామి రథయాత్ర అనే ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంది. వేలాది మంది భక్తులు ఆ యాత్రలో పాల్గొంటున్నారు. అక్కడ వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. తొలి సినిమానే అయినప్పటికీ ఇంత గ్రాండ్‌గా నిర్మించి, ప్రచారం చేయడం మామూలు విషయం కాదు.
-ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా కొత్త రియల్ గా అనిపిస్తుంది. ఇప్పటికే అందరూ వీఎఫ్ఎక్స్ను ప్రశంసిస్తున్నారు. నిజంగా అద్భుతమైన ఔట్పుట్ వచ్చింది.
విరాట్ కర్ణ గారి గురించి?
-విరాట్ కర్ణ చాలా ప్యాషన్, డెడికేషన్ ఉన్న నటుడు. ఇది ఆయన రెండో సినిమా అని అనిపించదు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవం.
డీవోపీ సౌందర్ రాజన్ గారి గురించి?
సౌందర్ రాజన్ గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. నిజంగా ప్రేక్షకులు విజువల్స్ చూసి ఆశ్చర్యపోతారు. ప్రతి ఫ్రేమ్ కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మీరు అంత వేగంగా సినిమాలు చేయకపోవడానికి కారణం?
-నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి గాయం అయింది. ఆ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలి. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావిస్తాను. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించాను.
‘నాగబంధం’ షూటింగ్ అనుభవం?
-నాగబంధం చాలా భారీ స్థాయి సినిమా. ప్రతిరోజూ షూటింగ్లో దాదాపు 200 మంది ఉండేవారు. ప్రతి షెడ్యూల్‌కు సినిమా స్కేల్ మరింత పెరుగుతూ వెళ్లింది. ఈ సినిమాతో టీమ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నేను నేర్చుకున్నాను.
స్వయంభూలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు కదా?
-అవునండి. ఇలాంటి రెండు భారీ చిత్రాల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమాలు. అలాంటి రెండు చిత్రాల్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. ఒక నటిగా నాకు చాలా సంతృప్తిగా ఉంది.








