సర్దార్ కంటే ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ పదిరెట్ల ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది : హీరో కార్తి
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
సర్దార్ సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వాటర్ బాటిల్ చూస్తే ఆ సినిమానే గుర్తొచ్చింది. సర్దార్ 2 కథ ఎలా ఉండబోతుంది?
-ఇండియాలో స్పై సినిమాలు చాలా తక్కువ. ఆ సినిమాలు తీయడం అంత ఈజీగా కూడా కాదు. మనకి స్పై అంటే టామ్ క్రూజ్ లాంటి హీరోలు గుర్తుకొస్తారు. ‘సర్దార్’ కథ చెప్తున్నప్పుడు ఒక లుంగీ వేసుకున్న గూఢచారి అని చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యాను. రవీంద్ర కౌశిక్ అనే ఒక రంగస్థల నటుడు పాకిస్తాన్లో ఒక మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. ఆ కథ మనందరికీ తెలుసు. అలాగే స్పై అధికారులు మనమధ్యే సాదాసీదాగా ఏం తెలియనట్లు ఉంటారు. దర్శకుడు అలాంటి అంశాలన్నీ జోడిస్తూ కథ చెప్తున్నప్పుడు నాకు చాలా నచ్చింది.
-మనకి ప్రపంచంలో ప్రాచీన నాగరికత నుంచి యుద్ధం జరిగినప్పుడు ఒక దేశానికి మరో దేశానికి వాటర్ కనెక్షన్ ఆపేసేవారు. నీరే మనకి జీవం. అలా వాటర్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు అందరికీ అది చాలా కొత్త విషయం అనిపించింది. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
-‘విక్రమ్’ లాంటి సినిమాల్లో చూస్తే అందులో ఒక పర్సనల్ వార్ ఉంటుంది. ‘సర్దార్’ విషయానికి వస్తే అది ఒక సొసైటీ కోసం ఒక గూఢచారి చేస్తున్న వార్. వాటర్ కమర్షియల్ కాకూడదని అతను చేస్తున్న పోరాటం. దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్‌కి చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
– సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు ‘సర్దార్’ మళ్లీ ఎందుకు తిరిగి వచ్చాడు అనేది ఒక గొప్ప ఆలోచనతో డైరెక్టర్ వచ్చారు. అలాగే దాంతో పాటు విలన్ క్యారెక్టర్ కూడా దొరికిందని చెప్పారు. ఆ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారు చేస్తున్నారు. ఇప్పుడే సర్దార్ 2 కాన్సెప్ట్ గురించి ఎక్కువ చెప్పకూడదు.
-సర్దార్ లో వాటర్ కాన్సెప్ట్ మీకు ఎలా ఇంపాక్ట్ చేసిందో.. దానికి పది రెట్లు ఇంపాక్ట్‌ఫుల్‌గా ‘సర్దార్ 2’ ఉంటుంది. ‘సర్దార్’ సినిమాని తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆదరించారు.
సర్దార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది?
-మనకి ఈ మధ్యకాలంలో స్పై యూనివర్స్‌లో ‘దురంధర్’ సినిమా వచ్చింది. కాకపోతే దాని కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ‘సర్దార్ 2’లో కూడా కాన్సెప్ట్ పరంగా, విజువల్ పరంగా చాలా హై స్టాండర్డ్‌లో ఉండబోతుంది. సౌత్‌లో కూడా ఇంత గొప్ప స్థాయిలో సినిమా చేయగలమని చెప్పేలా ‘సర్దార్ 2’ ఉంటుంది.
-గూఢచారులకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు. అలాగే వాళ్లు పడుతున్న కష్టానికి కూడా గుర్తింపు ఉండదు. ఎందుకంటే చేస్తున్న పని ఎవరికీ తెలియకూడదు. ‘దురంధర్’ సినిమాలో ఇండియా నుంచి బయటికి వెళ్లి చేసే ఆపరేషన్ ఉంటుంది. దాదాపుగా గూఢచారి సినిమాలన్నీ కూడా బయట జరుగుతుంటాయి. ‘సర్దార్ 2’ ఇండియాలో జరుగుతున్న ఒక ప్రాబ్లమ్‌ని ఒక గూఢచారి ఎలా హ్యాండిల్ చేశాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
-చాలా లార్జ్ స్కేల్లో సినిమా చేశాము. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి చివరి వరకు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ప్లాష్ బ్యాక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.
-ఇది సీక్వెల్ కాబట్టి ఇంకా ‘సర్దార్’ చూడని వాళ్లు ‘సర్దార్’ చూడండి. యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమాను ఉంచాము. చూసిన వాళ్లు కూడా ఒకసారి రీవాచ్ చేసి వస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు.
ఇందులో మీ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
-ఇందులో ఫాదర్, సన్ క్యారెక్టర్స్ కలిసి ట్రావెల్ చేస్తారు. రెండు పాత్రలు ఒకేసారి చేయడం చాలా చాలెంజింగ్. అలాగే మేకప్ విషయంలో కూడా చాలా ఓపికతో చేశాం.
-నాకు యాక్షన్ చాలా ఇష్టం. కానీ ఇందులో ఒక ఛాలెంజ్ ఉంది. ఇందులో ఒక ఓల్డ్ మాన్‌లాగా ఫైట్ చేయాలి. ఓల్డ్ మాన్ చాలా స్కిల్‌గా ఉంటాడు. తను ఫైట్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. అందులోనూ తను గూఢచారి కాబట్టి తన దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఫైట్స్ చాలా ఎంజాయ్ చేశాను.
హీరోయిన్స్ గురించి ?
-ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఆశిక రంగనాథన్, మాళవిక మోహనన్ పాత్రల్లో చాలా కొత్త డైమెన్షన్ తీసుకొస్తారు. ఆ పాత్రలు రెగ్యులర్‌కి భిన్నంగా చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటాయి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, వాళ్లు దేశం కోసం ఎలా పోరాడతారనేది ఇందులో చూపించాం.
-ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. స్పైడర్ లో ఏది మిస్ అయిందో ఇందులో అది వర్కౌట్ అయిందని సూర్య గారు చెప్పారు. సూర్య గారు తన క్యారెక్టర్‌కి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పారు.
-హై వాల్యూ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం వందే భారత్ ట్రైన్ మొత్తం సెట్ వేశారు. ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ ఎవరూ చేయలేదు. ప్రొడ్యూసర్స్ చాలా ఖర్చు చేశారు. ఎక్కడా రాజీ పడలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా బిగ్ స్కేల్ లో తీశారు.
మీకు సర్దార్ విషయంలో గుర్తుండిపోయిన విషయం ఏమిటి?
-‘సర్దార్’ రిలీజ్ తర్వాత నేను ఒక చోటకి షూటింగ్‌కి వెళ్లాను. ఒక ముగ్గురు కుర్రోళ్లు కారు వెనక వచ్చి.. “వాటర్ బాటిల్ ప్లాంట్స్‌ని మేము రానివ్వము” అని గట్టిగా అరిచారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నపిల్లల వరకు అది రీచ్ కావడం చాలా హ్యాపీగా అనిపించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా రిలీజ్ చేస్తుంది కదా.. వారితో మీ అసోసియేషన్ గురించి?
-ఒక మంచి సినిమా ఉన్నప్పుడు నేను కాన్ఫిడెంట్‌గా ఉంటాను. నాగార్జున అన్నయ్య ఉన్నప్పుడు నేను మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటాను. మాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు నా గురించి మాట్లాడినా తమ్ముడు అనే మాట్లాడతారు. సినిమాకి ఏం కావాలో వాళ్లు అన్నీ అద్భుతంగా చేస్తారు. ‘సర్దార్’ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు సర్దార్ 2 కూడా ఆ సంస్థలోనే రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది.
దర్శకుడు మిత్రన్ గురించి?
డైరెక్టర్ మిత్రన్ చాలా అద్భుతమైన స్కిల్ ఉన్న డైరెక్టర్. తనకి ఆడియన్స్‌కి ఏం కావాలో అలాంటి కాన్సెప్ట్‌ని డిజైన్ చేస్తుంటాడు. ‘సర్దార్ 1’కి ఇప్పటికీ తనలో ఇంకా ఎంతో పరిణితి వచ్చింది.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-శైలేష్ గారితో ‘హిట్ 4’చేస్తున్నాను. కళ్యాణ్ శంకర్ గారితో చాలా మంచి ఎంటర్టైనర్ చేస్తున్నాను. మంచి ఫన్ సినిమా. అలాంటి సినిమా చేసి చాలా రోజులు అయింది. ‘మార్షల్’ సినిమా 50% షూటింగ్ పూర్తి అయింది.
సూర్య గారు, మీరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు?
-మాకు కూడా చేయాలనే ఉంది. కాకపోతే అలాంటి కథ, దర్శకుడు కుదరాలి. మేము కూడా అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నాం.








