స్వర సిద్ధి గోవిందునికి కామాక్షి వారి స్వర సేవ
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం “కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్” ఆధ్వర్యంలో గురువులు శ్రీమతి సీత దేవిక ద్రోణంరాజు మరియు శ్రీమతి వక్కలంక సౌజన్య గారి మార్గదర్శకత్వంలో అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురుదేవతా స్తుతితో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్కు చెందిన కళాకారులు శ్రీమతి సీత దేవిక ద్రోణంరాజు, శ్రీమతి వక్కలంక సౌజన్య, చింత లక్ష్మీ శ్రీ వైష్ణవి, దిల్లీ సుమ, పడకంటి రిద్ధి, కొరివి లలిత, సాన్విత్ రాచూరి, కర్రె విష్ణు ప్రియ, మోనిక చొల్లేటి, సహస్ర మంత, తిమ్మరాజు చంద్రిక, సి. ఆరాధ్య, ఎం.వి.ఎస్. సాయి శ్రుతి, నందన కృతి సత్యవోలు, పవని పొలోజు, విదుల రాయబండి, శ్రేష్ఠ ద్రోణంరాజు, మహాలక్ష్మి ద్రోణంరాజు తదితరులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక స్వరార్చన సమర్పించారు.
ఈ సందర్భంగా “మేలుకొనవే నీలమేఘ, ఆదిమూర్తి యీతడు, మత్స్య కూర్మ వరాహ, అంగనకు నీవె, రామ రామచంద్ర, కొలువై వున్నాడు, ఇందరికీ అభయంబు, ఎట్టు గూడె పెండ్లి, శరణు శరణు సురేంద్ర, పెరిగినాడు చూడరో, నారాయణాచ్యుతానంత, ఈతడే ముక్తి దోవ, లాలి శ్రీ కృష్ణయ్య” వంటి అన్నమాచార్య సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
శిష్యుల గానంలో అన్నమయ్య సాహిత్యంలోని భక్తి, మాధుర్యం, ఆధ్యాత్మిక భావం ప్రతిధ్వనించగా, సమిష్టి స్వరార్చన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించి గానానికి మరింత శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని పక్షాన గురువులు, కళాకారులను అభినందించి, అన్నమయ్య సంకీర్తనలను భావ పూర్వకంగా ఆలపిస్తూ భక్తి సంగీత పరంపరను కొనసాగిస్తున్న కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కృషిని ప్రశంసించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న కళాకారులకు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.








