తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈవోగా ‘భాస్కర్’..!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో (Deputy EO)గా భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుమలలోనే రిసెప్షన్-1 డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భాస్కర్‌కు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ పూర్వ డిప్యూటీ ఈవోగా పనిచేసిన లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ తనిఖీల్లో ఆయన ‘ఆదాయానికి మించిన ఆస్తులు’ కలిగి ఉన్నట్లు పక్కా ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు లోకనాథంను అరెస్ట్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో స్థానంలో ఉన్న అధికారి ఇలా అవినీతి కేసులో బుక్ అవ్వడం టీటీడీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. లోకనాథం అరెస్ట్‌తో శ్రీవారి ఆలయ పరిపాలన పరమైన పనులకు, భక్తుల సేవల నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా టీటీడీ యంత్రాంగం తక్షణమే అప్రమత్తమైంది.
తిరుమల కొండపై రిసెప్షన్ విభాగంలో మంచి అనుభవం ఉన్న భాస్కర్‌ను తక్షణమే ఆలయ అదనపు బాధ్యతల్లోకి దించుతూ ఆదేశాలు ఇచ్చింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో పరిధిలోకి లడ్డూల తయారీ కేంద్రం (పోటు), ఆలయం లోపల జరిగే అర్జిత సేవలు, శ్రీవారి హుండీ పరకామణి వంటి అత్యంత కీలకమైన విభాగాలు వస్తాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఆలయ డిప్యూటీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టడం భాస్కర్‌కు ఒక పెద్ద సవాల్ కానుంది.








