స్పేస్ లో భారత్ ఐ..ఈఓఎస్-05తో ప్రత్యర్థులకు గుబులే..!
అంతరిక్ష రంగంలో ఇస్రో మరోసారి సత్తా చాటింది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణ రంగాల్లో కీలకమైన ‘ఈఓఎస్-05’(జీశాట్-1ఏ) ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ కక్ష్యలోకి చేరింది.
శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహకనౌక మేఘాలను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(సబ్-జీటీఓ)లోకి రాకెట్ కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఉపగ్రహం పెరీజీ 170 కి.మీ, అపోజీ(దూరపు బిందువు) 28,934 కి.మీ కక్ష్యలోకి చేరుకుంది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం.
విశ్వంలో భారత్ ఐ..!
సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్(లియో), సన్ సింక్రోనస్ ఆర్బిట్లలో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని ఫొటో తీయడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుంది. కానీ ఈఓఎస్-05 భూస్థిర కక్ష్యలో (జియో ఆర్బిట్) ఉంటూ.. ఒకే ఫ్రేమ్‌లో మొత్తం దక్షిణాసియాను ఫొటో తీయగలదు. భారత ఉపఖండం మొత్తాన్ని కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపగలదు. ఇందులో అమర్చిన ఎంఎక్స్-వీఎన్ఆర్ పేలోడ్ అద్భుతమైన 42 మీటర్ల(ఒక పిక్సెల్కు) స్పేషియల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. జియో కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాతో ఉన్న ఉపగ్రహం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇస్రోకు ఉన్న సామర్థ్యంతో పోలిస్తే.. దీని పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉండటం విశేషం.
సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఈ ఉపగ్రహం ఇట్టే పసిగట్టేస్తుంది.
2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్10 మిషన్ ద్వారా ప్రయోగించిన జీశాట్-1 ఉపగ్రహం విఫలమై కక్ష్యను చేరుకోలేకపోయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన సాంకేతికతతో ఇస్రో ఇప్పుడు ఈఓఎస్-05(జీశాట్-1ఏ)ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి తన సత్తా చాటింది.








