అయోధ్య ట్రస్ట్ నూతన సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
అయోధ్య రామ మందిర ట్రస్ట్ నూతన సీఈవో గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వైమానిక దళ అధికారి అయిన మిశ్రా, గతంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు ‘ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్’ (AOC-in-C)గా సేవలందించారు. రామమందిరానికి ఆయన తొలి శాశ్వత సీఈఓగా వ్యవహరించనున్నారు. ఇక నుంచి రామ మందిరానికి సంబంధించిన పరిపాలనా, ఆర్థిక, న్యాయపరమైన నిర్వహణను పర్యవేక్షిస్తారు. ఆలయ సీఈవో పదవి కోసం ట్రస్ట్ కు 5,500 లకు పైగా దరఖాస్తులు రాగా.. ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ ముగ్గుర్ని షార్ట్ లిస్ట్ చేసి, చివరికి జితేంద్ర మిశ్రాను ఎంపిక చేసింది.
ఈ మేరకు జన్మభూమి ట్రస్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 5,585 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. 39 ఏళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించిన జితేంద్ర మిశ్రాను ఆలయ ట్రస్ట్ సీఈఓగా నియమిస్తున్నట్టు ప్రకటించింది.
ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (SYSM, AVSM, VSM) పదవీ విరమణ వయస్సు పూర్తి చేసుకుని, 2026 ఏప్రిల్ 30న భారత వైమానిక దళం నుండి పదవీ విరమణ చేశారు.మిశ్రా ఫైటర్ విభాగంలో పనిచేశారు మరియు 18575 F(P) సర్వీసు నంబర్‌తో సేవలందించారు. 1986 డిసెంబర్ 6 న ఆయన వైమానిక దళంలో చేరారు.
ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళానికి చెందిన పదవీ విరమణ పొందిన సీనియర్ అధికారి. ఆయన 2025 జనవరి 1 నుండి 2026 ఏప్రిల్ 30 వరకు వైమానిక దళం యొక్క అత్యంత కీలకమైన ‘వెస్ట్రన్ ఎయిర్ కమాండ్’కు ‘ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్’ (AOC-in-C)గా సేవలందించారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా, భట్పార్ రాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని భోపత్‌పురా గ్రామానికి చెందినవారు.
ఆయనకు ‘ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్’ (SYSM), ‘అతి విశిష్ట సేవా మెడల్’ (AVSM) మరియు ‘విశిష్ట సేవా మెడల్’ (VSM) లభించాయి. ఇటీవల, ‘ఆపరేషన్ సింధూర్’ (మే 2025) సమయంలో ‘వెస్ట్రన్ ఎయిర్ కమాండ్’ చీఫ్‌గా తన పాత్ర గురించి ఆయన వివరంగా మాట్లాడారు. S-400 వ్యవస్థను ఉపయోగించి, 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ AWACS విమానాన్ని లక్ష్యంగా చేసుకుని చర్య చేపట్టడానికి తాను అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అంతేకాకుండా ఆయన ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్లో సీనియర్ టెస్ట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, మిగ్-21 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, విమానాల అప్గ్రేడ్ల డైరెక్టర్ (ప్రాజెక్టులు), మరియు సు 30 MKI ఆపరేటింగ్ ఎయిర్‌బేస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పదవులు నిర్వహించారు. ఆయన ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్మెంట్ గ్రూప్ డైరెక్టర్‌గా పనిచేశారు.
రామ్ మందిర్ సీఈఓగా, జితేంద్ర మిశ్రా ఆలయ రోజువారీ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు కల్పించే సౌకర్యాలు మరియు న్యాయపరమైన అంశాలను పర్యవేక్షిస్తారు. తాము సీఈఓ తమ పర్యవేక్షణలోనే పనిచేస్తారని ట్రస్ట్ స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ఆయన ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఎయిర్ మార్షల్ మిశ్రాకు ఉన్న సైనిక క్రమశిక్షణ మరియు పరిపాలనాపరమైన అనుభవం, ట్రస్ట్ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.








