మాజీ సీఎం మమతపై ఎఫ్ఐఆర్ .. సీఎం సువేందు ఆదేశాలు..!
బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈసారి సాక్షాత్తూ మాజీ సీఎం మమతాబెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్‌కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కలకత్తా హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అందులో ముఖ్యంగా రహదారిపై ఒక లేన్‌ను పూర్తిగా ట్రాఫిక్‌కు వదిలిపెట్టి, మరో లేన్‌లో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ర్యాలీ నిర్వాహకులు రెండు లేన్లను దిగ్బంధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఉల్లంఘనలపై ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. “కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన తీరు స్పష్టంగా కనిపించింది. రహదారిలో ఒక లేన్‌ను ఖాళీగా ఉంచాలని కోర్టు చెప్పినా, మాజీ ముఖ్యమంత్రి ప్రజలను సమీకరించి రెండు లేన్లనూ మూసివేశారు. ఈ విషయంలో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాను. దీనిపై కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించాలని సూచించాను. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని సువేందు అధికారి స్పష్టం చేశారు.
సువేందు అధికారి ఆరోపణలకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రితబ్రత బెనర్జీ కూడా మద్దతు పలికారు. ర్యాలీలో పాల్గొనేవారి సంఖ్యపై కూడా కోర్టు పరిమితులు విధించిందని, వాటిని కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. బారికేడ్లను తొలగించి రోడ్డంతా ఆక్రమించాలని మమతా బెనర్జీ తన అనుచరులను రెచ్చగొట్టడం కనిపించిందని ఆయన ఆరోపించారు.
శుక్రవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ.. అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అరాచకాలే రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.








