కేబినెట్ విస్తరణపై గుత్తా సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూనే, ఆయన చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ గురించిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే గ్రూపు విభేదాలు, ఆశావహుల ఒత్తిళ్లతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి గుత్తా చేసిన సూచనలు ఒక కొత్త రాజకీయ సమీకరణాన్ని తెరపైకి తెచ్చాయి.
గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని యువకుడు, అత్యంత ఉత్సాహవంతుడైన నాయకుడిగా అభివర్ణించారు. రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును అడ్డుకోకుండా, ఆయనను పూర్తిస్థాయిలో పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. గత కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే, రేవంత్ సరికొత్త ప్రజా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పార్టీ క్యాడర్లో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ, సాధారణ ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారన్న ఆయన విశ్లేషణ ప్రభుత్వానికి రాజకీయంగా ఊరటనిచ్చే అంశం.
గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నందున, ప్రస్తుత క్యాబినెట్‌ను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని గుత్తా స్పష్టం చేశారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహం, పాలనలో కొత్తదనం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సూచన కాంగ్రెస్ అధిష్ఠానానికి కత్తిమీద సాము లాంటిది. ఇప్పటికే పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేపడితే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను సరిచేయడం పార్టీకి సవాలుగా మారుతుంది. ఉన్న మంత్రులను తప్పిస్తే లేదా ఆశావహులకు నిరాశ ఎదురైతే, అది బహిరంగ తిరుగుబాటుకు దారితీసే ప్రమాదం ఉంది.
తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీలోనూ సరైన క్రమశిక్షణ లేదని గుత్తా కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే నాయకులపై కఠినంగా వేటు వేయకపోతే భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమాచార లీకేజీలను అరికట్టడం, క్యాడర్లో సమన్వయం సాధించడం తక్షణ అవసరమని పేర్కొన్నారు.
రాజకీయ అంశాలతో పాటు పాలనాపరంగా కూడా గుత్తా కీలక సూచనలు చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు నాలుగు పంటలకూ రైతు భరోసా అందించాలని కోరారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-Aను రద్దు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అవరోధాలను తొలగించాలని సూచించారు. విచక్షణారహితంగా ఉచితాలు పంచడం కంటే, కేవలం అర్హులైన నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు చేరేలా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను విస్మరించవద్దని, వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలని గుర్తుచేశారు.
ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శాసన మండలి చైర్మన్ స్థానం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఒకవైపు దిశానిర్దేశంలా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతర్గత కుమ్ములాటలను అధిగమించి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జోలికి వెళ్లాలా, లేక యథాతథ స్థితిని కొనసాగించాలా అన్న సందిగ్ధంలో టీ-కాంగ్రెస్ పడింది.








