షాకింగ్: ఉద్యోగాలను తీసేయమన్న బాస్.. వద్దని ఆపిన AI!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
వినడానికి ఇది ఏదో సినిమా కథలా అనిపిస్తోంది కదూ? కానీ, టెక్ ప్రపంచాన్ని శాసించే మెటా కంపెనీలో నిజంగానే జరిగింది!
ఒకరోజు ఆఫీసులో బాస్ టేబుల్ మీద ఒక లిస్ట్ పడింది. ఒక్కో టీమ్‌లో పది మంది ఉంటే, అందులో ఏకంగా ఆరుగురిని పీకేయాలని యాజమాన్యం గట్టిగానే ఫిక్స్ అయిపోయింది. “అరే భయ్యా, ఇప్పుడు పనులన్నీ ఏఐ చేసేస్తోంది కదా! మనుషులు ఎందుకు చెప్పండి? జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఉండదు” అని గట్టి ప్లానే వేశారు.
కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది! ఉద్యోగులను తొలగించే ముందు, ఫైనల్ గా…ఇక నుంచి తమ కంపెనీని నడపబోయే ఆ ఏఐ టూల్ కే ఒక క్వెశ్చన్ వేసింది మేనేజ్మెంట్. “ఇంతమందిని తీసేస్తే ఎలా ఉంటుందిమ్మా?” అని.
అప్పుడు ఆ స్క్రీన్ మీద ఏఐ ఇచ్చిన ఆన్సర్ చూసి అందరూ షాక్ అయ్యారు. అదేంటంటే.. “వద్దు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి!మునిగిపోతారు” అని.
అందుకు కారణం కూడా చెప్పింది…”చూడండి బాస్.. అందరినీ ఒకేసారి ఇలా తొలగిస్తే, మిగిలిన వాళ్లలో కూడా టెన్షన్ పెరుగుతుంది, తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అంతేకాదు అంత స్పీడుగా మనుషులను తీసేసి అన్నీ ఏఐతో నడిపించడమంటే కంపెనీకే పెద్ద రిస్క్, రేపు ఏదన్నా ఏఐ పొరపాటు చేస్తే సరిచేసేదెవరు..అప్పటికప్పుడు ఎంప్లాయిస్ ఎక్కడ దొరుకుతారు,ప్రాక్టికల్ గా ఆలోచించు బాస్..ఏఐ లా ఆలోచించకు” అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట.
ఇన్నాళ్లూ మనం ఏమనుకున్నాం? ఏఐ వస్తే మన ఉద్యోగాలు గల్లంతైపోతాయి, మనకంటే ముందే అది మన కుర్చీకి అతుక్కుపోతుంది అనుకున్నాం. కానీ ఈ మెటా స్టోరీ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఈరోజు చాలా మంది ఉద్యోగాలను బాస్ నుంచి కాపాడే రక్షకుడు కూడా ఈ ఏఐనే అయ్యాడు కదా!
మరి ఇదంతా ఏదో ఊహ అనుకుంటున్నారా? కానే కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నడిపే మెటా కంపెనీలో ఇదే జరిగిందని తెలుస్తోంది. ఏఐ వస్తోంది కదా అని మే, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా భారీగా కోతలు పెట్టాలని చూశారట. ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ 10 శాతం మందిని తగ్గించేశారు కూడా. కానీ రెండో దశలో ఏఐ ఇచ్చిన రిపోర్ట్ చూశాక జుకర్‌బర్గ్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట.
ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉందిలెండి! ఏఐకి మన మీద ఏవో ప్రేమలు పుట్టుకొచ్చి, జాలితో ఉద్యోగాలు కాపాడిందని అనుకుంటే పొరబడినట్టే. కంపెనీలో అలా సడన్‌గా అందరినీ తీసేస్తే జరిగే నష్టాలు, మేనేజ్మెంట్ ఎదుర్కొనే తలనొప్పులను అది పచ్చిగా అంచనా వేసి చెప్పిందంతే!
కానీ ఆలోచిస్తేనే భయమేస్తోంది కదూ? రేపు పొద్దున యాజమాన్యం మనల్ని తీసేయాలని చూస్తే.. “వద్దు బాస్, వీళ్లు కంపెనీకి చాలా ముఖ్యం” అని మన గురించి ఏఏఐని మాట్లాడమని రిక్వెస్ట్ చేసే రోజులు వస్తాయా?
ఇంతకీ ఇప్పుడు ఈ ఏఐని మనం శత్రువు అనాలా? లేక మన ఉద్యోగాలను కాపాడే హీరో అనాలా? అసలు మనం ఏఐని చూస్తున్న కోణం తప్పు అంటారా? మీకేమనిపిస్తోంది?








