భారత్ లో సోనియా గాంధీ పుస్తకంపై పబ్లిషర్స్ మెలిక
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గ్రంథం విడుదల కాకముందే రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచురించే హక్కులు పొందిన పెంగ్విన్ రాండమ్ హౌస్ సంస్థ.. భారత్లో మాత్రం దానిని తాము ప్రచురించటం లేదని ప్రకటించింది. ఈ పుస్తకం వచ్చే నవంబరు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని పెంగ్విన్ రాండమ్ హౌస్కుఅమెరికాలో అనుబంధ పబ్లిషర్ అయిన ఆల్ర్ఫెడ్ ఏ నాఫ్ ఈ నెల మొదట్లో ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ వాదులు, సోనియా అభిమానులు ఆ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ ప్రచురణ సంస్థ పెంగ్విన్ తాము భారత్ లో దీనిని ప్రచురించడం లేదని చెప్పడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. పుస్తకంలో కొన్నిచోట్ల తాము సూచించిన మార్పులు చేసేందుకు రచయిత (సోనియాగాంధీ) అంగీకరించలేదని, అందువల్లే భారత్లో ఆ గ్రంథం ప్రచురణ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ‘‘ఒక ప్రచురణకర్తగా పుస్తకం నాణ్యతను పెంచేందుకు రచయితలకు సలహాలు ఇవ్వడం, విషయాలను సరిచూసుకోవడం మా హక్కు, బాధ్యత. ఇది ప్రచురణ ప్రక్రియలో సాధారణంగా జరిగే భాగమే’’ అని తెలిపింది.
పెంగ్విన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో, భారత్లో ఈ పుస్తక హక్కులను పొందేందుకు పలువురు భారతీయ ప్రచురణకర్తలు పోటీ పడుతున్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కొల్లిన్స్’ ఈ ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అమెరికన్ పబ్లిషింగ్ దిగ్గజం, పెంగ్విన్ రాండమ్ హౌస్కు చెందిన ఇంప్రింట్ అయిన ‘ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్’ పబ్లిషర్, సోనియా గాంధీ ఆత్మకథ నవంబర్ 10న విడుదల కానున్నట్లు ప్రకటించింది.
పెంగ్విన్ సంస్థ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను ఆ సంస్థ చంపేసిందని కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు. ‘సోనియాగాంధీ ఆత ్మకథ గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచురించేందుకు పెంగ్విన్ రాండమ్ కంపెనీ సిద్ధంగా ఉంది. కానీ, భారత్లో దాని అనుబంధ సంస్థ అయిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా మాత్రం ఆ గ్రంథంలో మార్పులు చేయాలని కోరుతోంది. అందుకు కారణమేంటి? ఆ సంస్థ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గింది? అంటూ మండిపడుతున్నారు.








