నేపాల్ ప్రళయంపై కేంద్రం హై అలర్ట్..!
నేపాల్(Nepal) హఠాత్ వరదల విపత్తుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాజా పరిస్థితులపై ఒక కీలక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటు కాఠ్మాండూ (నేపాల్), బీజింగ్ (చైనా) లలోని భారత రాయబారులు నేరుగా పాల్గొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకుల(Indian tourist) స్థితిగతులను, వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి మరియు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన అత్యవసర రెస్క్యూ ప్లాన్లపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మరోవైపు నేపాల్ వరదల్లో భారతీయ పర్యాటకుల గల్లంతుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ జల ప్రళయంలో ఇప్పటివరకు 288 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు కేంద్రం ధృవీకరించింది. అయితే, దట్టమైన కొండ లోయల్లో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మిగిలిన వారి ఆచూకీ కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇదే సమయంలో, నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. తెలుగు పర్యాటకులు ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఏపీ సీఎంఓ (AP CMO), ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో పాటు నేపాల్‌లోని భారత ఎంబసీతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.








