అమెరికాలోని 9నగరాల్లో, 42రోజులకుపైగా గణపతి సచ్చిదానంద స్వామీజీవారి స్వర్ణయాత్ర విజయవంతం
పూజ్యశ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ వారు 1976 లో తొలిసారిగా అమెరికా దేశంలో పర్యటించారు. ఈ సంవత్సరం వారి పర్యటన యాభై సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా పూజ్య స్వామీజీ వారు అమెరికా దేశంలో స్వర్ణయాత్ర చేశారు. 9 నగరాల్లో, 42రోజులకుపైగా ఈ యాత్ర సాగింది. ఇందులో భాగంగా బాటనరూజ్, ఆస్టిన్, హ్యూస్టన్, డల్లాస్, పిట్స్బర్గ్, వాషింగ్టన్ డి.సి., ఒమాహా, ఫ్రీమాంట్ తదితర నగరాల్లో పర్యటించారు. వాషింగ్టన్ డి.సి. పర్యటన సందర్భంగా, పరిసర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు పూజ్య శ్రీ స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. వారి దివ్యసముఖంలో ఆశీస్సులు పొందేందుకు హాజరయ్యారు.జయలక్ష్మీ దత్తయోగా సెంటర్ ఆధ్వర్యంలో క్లార్క్స్బర్గ్లోని హాలీ వెల్స్ మిడిల్ స్కూల్లో మహా దర్శనం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పూజ్య శ్రీ స్వామీజీ అందరికీ తమ దివ్యదర్శనం ప్రసాదించి, ఆధ్యాత్మికతను పెంపొందించే అద్భుతమైన ప్రవచనంతో భక్తులను అనుగ్రహించారు.
పరమ పూజ్య శ్రీ స్వామీజీవారు టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నెలకొల్పబడిఉన్న హనుమాన్ దత్త యోగా సెంటర్ సందర్శించి, పవిత్రమైన శ్రీచక్ర పూజ నిర్వహించి, అనంతరం భక్తులను తన అమృతమయమైన ఆధ్యాత్మిక ప్రవచనంతో అనుగ్రహించారు. అదేరోజు సాయంత్రం, హనుమాన్ దత్త యోగా సెంటర్లో నిర్మాణంలో ఉన్న సింధూర కార్యసిద్ధి హనుమాన్ ఆలయం నిర్మాణానికి మద్దతుగా, శ్రీ స్వామీజీ తన విశిష్ట సంగీత కార్యక్రమమైన “వేణు రాగసాగర “ను భక్తులు కానుకగా అందించారు. ఈ కార్యక్రమానికి ఆర్చర్డ్ నగర మేయర్ గౌరవనీయులు శ్రీమతి మోర్గాన్ సుపాక్ హాజరై, శ్రీ స్వామీజీకి దత్తయోగ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన పత్రాన్ని అందజేశారు. అలాగే, హ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ డి. సి. మంజునాథ్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని, శ్రీ స్వామీజీ వారి దివ్యాశీస్సులు పొందారు.
తదుపరి ఈ స్వర్ణయాత్రలో భాగంగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ టెక్సాస్ రాష్ట్రంలోని, డల్లాస్ నగరంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయానికి “గురు పూర్ణిమ” సందర్భంగా జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని, రెండు వారాల ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం జూలై 19న విచ్చేశారు.ఆలయ అర్చకులు మరియు భక్తులు, రాజగోపురంతో సహా అద్భుతంగా అలంకరించబడిన ఆలయంలోకి, శ్రీ స్వామీజీని ఘనమైన శోభాయాత్రతో స్వాగతించారు. అనంతరం శ్రీ స్వామీజీ ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకుని హారతి సమర్పించారు. ఆ పవిత్ర సమయాన శ్రీ స్వామీజీ శ్రీచక్ర పూజను నిర్వహించగా, డల్లాస్–ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులైన వేణువాద్యకళాకారులు భక్తిరసపూరిత వేణుగాన సేవను సమర్పించారు. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ అర్చకులు మరియు ధర్మకర్తలు పుష్పమాలలతో శ్రీ స్వామీజీకి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.స్వర్ణయాత్ర ఉత్సవాలలో భాగంగా భారతదేశంలోని వివిధ సాంప్రదాయాలను ప్రతిబింబించే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది.నాగ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా శ్రీ స్వామీజీ ఆషాడ మాస పూజలను నిర్వహించి, నాగ ప్రతిష్ఠ కోసం పవిత్ర యంత్ర స్థాపనను వైదిక పద్ధతిలో నిర్వహించారు. పూజ్య శ్రీ స్వామిజి వారి అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశంతో కూడిన అనుగ్రహ బాషణ చేశారు. భక్తులకు ఎటువంటి కష్టం ఎదురైనా దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కష్టాలు తొలగుతాయి అని చెప్పారు.
స్వామీజీవారు తమ అనుగ్రహభాషణలో అమెరికా దేశంలోని అనేక పట్టణాలలో దత్తపీఠ శాఖలను స్థాపించామని, ఆ దత్తపీఠశాఖలలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు మొదలగు దేవత మూర్తుల ప్రతిష్ట చేశామని, దీని మూలంగా మన హిందువులు ఆయా ప్రాంతాల్లో దేవాలయాలు దర్శించి మన హిందూ ప్రాచీన ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకుని మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. విచ్చేసిన భక్తులందరూ పరవశంతో శ్రీస్వామీజీవారికి కృతజ్ఞతలు తెలియచేశారు. డల్లాస్లో గురుపూర్ణిమ మహోత్సవాల సందర్భంగా అమెరికా స్వర్ణ యాత్రలో భాగంగా క్రెడిట్ యÖనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ లొ వైభవంగా పరమపూజ్య శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే ‘’స్వర్ణ యాత్ర రాగసాగర” అనే ‘’మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ” కాన్సర్ట్ ను నిర్వహించారు. ఈ నాదచికిత్సా కార్యక్రమానికి వేలాదిమంది హాజరై, శ్రీ స్వామీజీ అనుగ్రహానికి పాత్రులయ్యారు. పూజ్య శ్రీస్వామీజీకి సంగీతమే భాష, సంగీతమే మతము, సంగీతమే శ్వాస, సంగీతమే భావము.
మరొక విశిష్ఠకార్యక్రమం శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన భగవద్గీత పారాయణ మహాయజ్ఞం. క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్, టెక్సాస్, డల్లాస్లో ఈ పారాయణ నిర్వహింపబడినది. ఇక్కడ హాజరైన వేలాదిమందిలో సగం మంది కంటే ఎక్కువమంది భగవద్గీతలోని, పద్ధెనిమిది అధ్యాయాలలోని అన్ని శ్లోకాలను కంఠస్థం చేసి పారాయణ చేశారు. వీరంతా ప్రవాస భారతీయులే. ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చిన్నపిల్లల నుండి, వృద్ధుల వరకు ఉన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా పారాయణ చేసిన ఈ కార్యక్రమం అంతా ఏక కంఠంతో, మధుర స్వరంతో, ఎంతో క్రమశిక్షణతో జరిగినది. ఇంతటి విశేషమైన కార్యక్రమము అమెరికాలో జరగడము, ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రవాస భారతీయులు హాజరవడము ఎంతో అద్భుతమైన విషయము. స్వామీజీ దివ్య సంకల్పముతోనే ఇంత పెద్ద కార్యక్రమాలు అమెరికా దేశంలొ జరిగినవి.
పూజ్య శ్రీ స్వామీజీ అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమహా నగరంలో హిందూ దేవాలయానికి ఆగస్టు ఐదవతేదీన విచ్చేశారు.
ఆలయ అర్చకులు, ట్రస్టీలు మరియు స్థానిక భక్తులచే భక్తిశ్రద్ధలతో ఘనంగా స్వాగతించారు. శ్రీ స్వామీజీ ఆలయంలోని దేవతామూర్తుల దివ్య దర్శనం చేసుకుని, హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మించిన తోరణ స్తంభాలను ప్రారంభించారు. అనంతరం శ్రీ స్వామీజీ తన దివ్య ప్రవచనంలో అందరూ భగవద్గీత పారాయణం చేయాలని దాని మూలంగా అందరి సమస్యలన్నీ తొలగుతాయని వారివారి కష్టాలకు పరిష్కారం లభించి సుఖశాంతులతో ఉండగలరని భక్తులకు సూచించారు. అనంతరం భక్తులందరూ ప్రార్థన ద్వారా తమ విన్నపాలను తెలియచేసి శ్రీ స్వామీజీ వారి దివ్య ఆశీర్వాదాలను పొందే సద్భాగ్యాన్ని పొందారు.


పూజ్య శ్రీ స్వామీజీ ఫ్రీమౌంట్ (కాలిఫోర్నియా)లోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయానికి ఆగస్టు తొమ్మిదవతేదీన విచ్చేశారు.
ఉదయం పూజ్య శ్రీ దత్తగురు నిర్వహించిన శ్రీచక్ర పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కెఎస్ హెచ్ టి ఫ్రీమాంట్ బృందం భజనలు ఆలపించింది. అనంతరం పూజ్య శ్రీ స్వామీజీ అనుగ్రహ భాషణంలో దశావతార మంత్రం గురించి వివరించారు.
సాయంత్రం 4 గంటలకు భక్తులు సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. భక్తులందరూ భక్తి పారవశ్యంతో ఆనందించారు. ఈపర్యటనలో ఎస్ జి ఎస్ దత్తాజీ మార్గ” ప్రారంభోత్సవం ఒక విశేషంగా చెప్పవచ్చును. చికాగోలోని(కార్పెంటర్స్ విల్) శ్రీ కృష్ణ దత్త హనుమాన్ ఆలయం వద్ద కూడా ఎస్ జి ఎస్ దత్తాజీ మార్గ్ న ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు.ఆరోజు కార్యక్రమాలకు ఆ మార్గ్ ప్రారంభంతోనే శ్రీకారం చుట్టారు. పూజ్య శ్రీ స్వామీజీ గారి గౌరవార్థం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వీధికి ఆయన పేరు పెట్టడం ఎంతో గొప్ప విశేషం. ఈ సందర్భంగా కార్పెంటర్స్విల్ గ్రామ అధ్యక్షులు మరియు పలువురు ప్రముఖులను సత్కరించారు.
ఆగస్టు పన్నెండవతేదీన, పూజ్య శ్రీ స్వామీజీ శ్రీ కృష్ణ దత్త హనుమాన్ ఆలయానికి విచ్చేసి, ధన్వంతరి హోమం పూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం శ్రీ స్వామీజీ పవిత్రమైన శ్రీచక్ర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్వాన్ జైత్ర వారణాసి గారి శిష్యులు సంగీత సేవను సమర్పించారు. భీమన అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీ స్వామీజీ భక్తులను దివ్య అనుగ్రహ భాషణంతో ఆశీర్వదిస్తూ, ఈ పవిత్ర దినం యొక్క విశిష్టతను మరియు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం భక్తులు అనఘ వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామీజీ పవిత్రమైన వేణు ధ్యాన కార్యక్రమం “కృష్ణ దత్త రాగసాగర” ద్వారా భక్తులను అనుగ్రహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో అమెరికాలో జరిగిన చారిత్రాత్మక స్వర్ణ యాత్ర ముగిసింది. శ్రీ స్వామీజీ అమెరికాకు తొలిసారిగా విచ్చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ గోల్డెన్ జూబిలీ టూర్, అమెరికాలోని తొమ్మిది నగరాల్లో 42 రోజులకు పైగా కొనసాగింది. తదుపరి శ్రీ స్వామీజీ వారు ఈ చారిత్రాత్మక యాత్రను కెనడాలో కొనసాగించనున్నారు. పూజ్య శ్రీ స్వామిజి వారి అమెరికా స్వర్ణ యాత్రలో సందర్శించిన అన్ని పట్టణాల కార్యక్రమాలలోనూ వేలాది సద్భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామీజీ వారి కృపకు పాత్రులయ్యారు.భక్తి పారవశ్యంలో ఓలలాడారంటే ఆశ్చర్యం లేదు.
జై గురుదత్త..
చెన్నూరు సుబ్బారావు








