‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది – దర్శకుడు రమణా రెడ్డి సోమ
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..
*మీ నేపథ్యం గురించి చెప్పండి?*
మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లోనే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. ఆ టైంలోనే ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడ్ని. 2007లోనే ఆఫీస్ స్టార్ట్ చేశాను. అర్కిటెక్చర్ ఇండస్ట్రీలో నాకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. కరోనా టైంలో సొంత ఊరికి వెళ్లాను. అప్పుడు ఖాళీగా ఉండటంతో ఓటీటీలో మరిన్ని సినిమాలు చూశాను.
*సినిమాలు తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది?*
కథలు రాయడం, చదవడం నాకు చాలా ఇష్టం. ఆరేడేళ్ల నుంచి కథల నుంచి రాయడం ప్రారంభించాను. నా సొంత అనుభవాలు, చూసిన వాటి నుంచి ఎన్నో రాసేవాడ్ని. తర్వాత సినిమాకి కథలు ఎలా రాయాలని నా స్నేహితుడి ద్వారా నేర్చుకున్నాను. యూట్యూబ్ ద్వారా కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంత మంది ఫ్రెండ్స్ సాయంతో షూటింగ్ సెట్‌కి వెళ్లాను. అలా మెల్లిగా సినిమాలతో నా జర్నీ ప్రారంభమైంది.
*మొదటి సినీ ప్రయత్నం గురించి చెప్పండి?*
మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం. ఊర్లో, సిటీలో కలిపి 33 నిమిషాలు పుటేజ్ వచ్చింది. అవుట్ పుట్ చూసి.. ఇలా కాదు.. ఇంకాస్త బాగా తీయాలని అనుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాకే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. పాడ్ కాస్ట్లో ఓ సారి మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ ‘అమీర్ లోగ్’ అని అన్నారు. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది.
*‘అమీర్ లోగ్’ జర్నీ గురించి చెప్పండి?*
‘అమీర్ లోగ్’ అనే టైటిల్‌ను ముందు ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి అసలైన అమీర్ లోగ్ ఎవరు? అని రకరకాలుగా రాసుకున్నాను. ఓ బస్తీ, ముగ్గురు కుర్రాళ్లు అని కథను రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ బస్తీని తెరపై అద్బుతంగా చూపించాలని అనుకున్నాను. రెండేళ్ల క్రితం స్క్రిప్ట్ పూర్తయింది. అందరితో చర్చించి, అందరి సలహాలు తీసుకునే స్క్రిప్ట్ రెడీ చేశాను. డెమో షూటింగ్ చేసి చాలా మందికి చూపించాం.
*సింక్ సౌండ్‌తో చేయాలని ఎందుకు అనుకున్నారు?*
ఆర్టిస్టులు ఎంతో నేచురల్‌గా నటించారు. కొంత డబ్బింగ్ చెప్పారు. కానీ నేను సెట్లో ఫీలైనట్టుగా.. డబ్బింగ్ తర్వాత ఫీల్ అవ్వలేకపోయాను. సౌండింగ్ నాకు సెట్ కాలేదు. అందుకే సింక్ సౌండ్‌కి వెళ్లాను. పైగా ఇలాంటి సినిమాకి అన్నీ సహజంగానే ఉండాలి. సెట్లు కూడా వేయలేం. బస్తీలోనే షూట్ చేయాలి. సింక్ సౌండ్‌తోనే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందని అనుకున్నాను.
*ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు?*
దాదాపు మా సినిమాని బస్తీలోనే షూటింగ్ చేశారు. డెమోతో కలిపి దాదాపు 43 రోజులు అయింది. బస్తీతోనే కేవలం 38 రోజులు షూటింగ్ చేశాం. నైట్ టైంలో మా షూటింగ్ వల్ల బస్తీ వాళ్లు కాస్త ఇబ్బంది అయితే పడ్డారు (నవ్వుతూ).
*రానా గారు, ఆయన టీం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చిన సలహాలు ఏంటి?*
‘అమీర్ లోగ్’ సినిమాని స్పిరిట్ టీంకి చూపించాం. ఫస్ట్ హాఫ్ చూసే బాగుందని అన్నారు. సెకండాఫ్‌కి ఆడియెన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి రానా గారి టీం అంతా సంతోషించారు. మాకు ఆయన ఇస్తున్న సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా మూవీ గురించి రానా గారు పోస్ట్ కూడా వేశారు. త్వరలోనే ఆయన మా సినిమాని కూడా చూస్తారు.
*హిందీ భాషని ఎక్కువగా చూపించారు? సినిమాలో సబ్ టైటిల్స్ ఏమైనా వేస్తారా?*
మన హైదరాబాద్‌లో మాట్లాడినట్టుగానే సినిమాలో ఉంటుంది. యాస మాత్రమే కనిపిస్తుంది. మన తెలుగు పదాల్లోనే ఉర్దూ పదాలు ఉంటాయి. సినిమా చూసేటప్పుడు భాష అనేది అంతగా గుర్తుకు రాదు. ఆ సీన్లోని భావం అందరికీ అర్థం అవుతుంది. ప్రేక్షకులందరికీ మా సినిమా నచ్చుతుంది.
*‘అమీర్ లోగ్’ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పండి?*
‘అమీర్ లోగ్’ మూవీని ఇప్పటికి చాలా మందికి చూపించాను. రీసెంట్‌గానే చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లకు చూపించాను. అందులో వీఎన్ ఆదిత్య గారు ‘అమీర్ లోగ్’ చిత్రాన్ని మెచ్చుకున్నారు. రైటింగ్ అద్భుతంగా ఉందని ఆయన ఇచ్చిన ప్రశంసను నేను మర్చిపోలేను. అమితాబ్ ‘ఝుండ్’, రణ్ వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చారు.
*‘అమీర్ లోగ్’ మ్యూజిక్ గురించి చెప్పండి?*
స్మరణ్‌ను ఓ దావత్ సాంగ్ ఇవ్వమని అడిగాను. కానీ స్మరణ్ సినిమాని చూసి ఎక్కడెక్కడ పాటలు ఉంటే బాగుంటుందో చెప్పాడు. అలా మాకు 10 అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. లిరిసిస్ట్ మనోజ్, నిఖిలేష్ మంచి సాహిత్యాన్ని అందించారు. కీరవాణి గారు పాడిన పాట దశాబ్దాల పాటుగా నిలిచి ఉంటుంది.
*సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ గురించి చెప్పండి?*
ఓ నాలుగైదు చోట్ల మ్యూట్ చేయమని చెప్పారంతే. ప్రతీ ఒక్క పాత్ర ఇందులో మెయిన్ కారెక్టర్‌గా ఉంటుంది. ప్రతీ పాత్ర కోణంలోంచి కథ కనిపిస్తుంది. నేను ఆర్టిస్టులకు ఫ్రీడం ఇచ్చాను. దాంతో వాళ్లు కూడా సెట్లో డైలాగ్స్‌ను ఇంప్రవైజ్ చేశారు. మా చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది.








