గమ్మత్తైన మర్డర్ మిస్టరీ: ‘Unidentified’ మూవీ రివ్యూ
రేటింగ్: 2.5/5
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక అమ్మాయి శవం ఎడారిలో దొరికింది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఇంట్లో కనిపించకపోయినా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్కూల్లో కనిపించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి ఆమెకు పేరు కూడా తెలియలేదు.ఈ పరిస్దితుల్లో గుర్తింపు లేని మహిళల సామూహిక సమాధిలో పాతిపెట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఒక మహిళ ని మాత్రం “ఈ అమ్మాయి ఎవరు?” అనే ప్రశ్నను వదలదు. అక్కడి నుంచే మొదలవుతుంది సౌదీ అరేబియా దర్శకురాలు హైఫా అల్-మన్సూర్ తెరకెక్కించిన ‘Unidentified’ కథ.
‘Unidentified’ను కేవలం మరో మర్డర్ మిస్టరీగా చూస్తే సినిమా అసలు పాయింట్ మిస్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ అసలు పాయింట్ “ఆ అమ్మాయిని ఎవరు చంపారు?” కాదు. “ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎందుకు ఎవరికీ పట్టలేదు, ఎందుకు పట్టించుకోలేదు?” అనేదే. ఒక మనిషికి పేరు, కుటుంబం, గుర్తింపు లేకపోతే..వాళ్ల మరణం కూడా సమాజానికి అంతే అనామకంగా మారిపోతుందా? సినిమా ఈ ఇబ్బందికరమైన ప్రశ్ననే మన ముందుంచుతుంది.
కథ
నావల్ (మిలా అల్ జహ్రానీ) స్థానిక పోలీస్ స్టేషన్లో పాత రికార్డులను డిజిటల్ చేసే ఉద్యోగం చేస్తుంటుంది. ఆమెకు నిజమైన పోలీస్ అధికారి హోదా లేదు. కానీ నిజ జీవితంలో ఎన్నో హత్యలు, నేరాల కథలు వింటూ పెరిగిన ఒక ‘ట్రూ క్రైమ్’ అభిమాని. ఫోన్లో మేకప్, ఫ్యాషన్ గురించి మాట్లాడుతూనే హత్యలు, రక్తపాత ఘటనలు, దారుణమైన నేరాలను వివరించే పాడ్‌కాస్టులు ఆమెకు ఇష్టం.
ఇదే ఆసక్తి తర్వాత ఆమెకు ఒక విచిత్రమైన ఆయుధంగా మారుతుంది. ఎడారిలో దొరికిన గుర్తుతెలియని టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని తను పనిచేస్తున్న స్టేషన్ లో పోలీసులు పరిశీలిస్తున్నప్పుడు.. మగ అధికారుల దృష్టికి రాని కొన్ని చిన్న విషయాలను నావల్ గమనిస్తుంది. అబాయాపై ఉన్న ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ, వేసుకున్న నకిలీ గోళ్లు వంటి చిన్న క్లూలు.. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరితో తిరిగింది అనే ప్రశ్నలకు తలుపులు తెరుస్తాయి.
ఇక్కడే సినిమా మరో ఇంట్రస్టింగ్ తీసుకుంటుంది. నావల్‌కు ఆమె ‘మహిళ’ కావడం ఒక ఇబ్బందిగా కాకుండా అదే ఆమెకు దర్యాప్తులో ఎంట్రీ పాస్ గా మారుతుంది. అమ్మాయిల స్కూళ్లు, హుక్కా లాంజ్‌లు, దుస్తుల దుకాణాలు..లాంటి మగ పోలీసులకు సులభంగా వెళ్లలేని ప్రదేశాల్లోకి ఆమె ఈజీగా అడుగుపెడుతుంది. అధికారికంగా తనకు లేని అధికారాన్ని అనధికారికంగా ఉపయోగించుకుంటూ నిజాన్ని వెతకడం మొదలుపెడుతుంది.
క్లూ ఇదే
కానీ ఆ అమ్మాయి చుట్టూ కనిపిస్తున్న నిశ్శబ్దమే అసలు భయంకరమైన క్లూ. స్కూల్లో ఒక అమ్మాయి కనిపించకపోవడం పెద్ద విషయం కాదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. కొందరు చదువు మానేస్తారు. కొందరికి పెళ్లి అయిపోతుంది. ఇంకొందరు కుటుంబాల నుంచి దూరమవుతారు. చివరకు ఈ అమ్మాయి కూడా ఎవరికీ అవసరం లేని మరో ‘మిస్సింగ్’గా మిగిలిపోయి ఉండొచ్చనే అనుమానం మొదలవుతుంది.
కథ కొద్ది దూరం వెళ్ళి ఆ కుటుంబం గురించి తెలిసే సరికి మరో ఆశ్చర్యపోయే విషయం తెలుస్తుంది. ఆమె కనిపించడం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కథలో మరో చీకటి కోణాన్ని తెరపైకి తెస్తుంది. ఆమెది ‘ఆనర్ కిల్లింగ్’ (పరువు హత్య) అయి ఉండొచ్చా? కుటుంబమే ఆమె మరణానికి కారణమా? లేక ఆమె జీవితం గురించి ఎవరికీ తెలియనంతగా ఆమె ముద్రలు సమాజం ముందే చెరిపేసిందా? నావల్ తవ్వుతున్న కొద్దీ హత్య వెనుక ఉన్న వ్యక్తి కంటే.. ఆ హత్యకు దారితీసిన సామాజిక వ్యవస్థే పెద్ద నిందితుడిలా కనిపించడం మొదలవుతుంది.
నావల్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక గాయం ఉంది. చిన్న కుమార్తెను కోల్పోయిన తర్వాత ఆమె మానసికంగా కుంగిపోతుంది. భర్తతో సంబంధం కూడా దెబ్బతింటుంది. ఆ వ్యక్తిగత నష్టం.. గుర్తింపు లేకుండా చనిపోయిన మరో యువతి పట్ల ఆమె చూపించే పట్టుదలకు మరింత అర్థాన్ని ఇస్తుంది. ఆమెకు అది కేవలం ఒక కేసులా కాదు. ఎవరో ఒకరి మరణాన్ని “ఇక వదిలేయండి” అని చెప్పే ప్రపంచానికి వ్యతిరేకంగా చేసే వ్యక్తిగత పోరాటంలా అనిపిస్తుంది.
ఇంట్రస్టింగ్ విషయం
అయితే ‘Unidentified’ ఇక్కడ మరో ప్రశ్నను కూడా మన ముందుంచుతుంది. మనం రోజూ వినే ‘ట్రూ క్రైమ్’ కథల సంగతి ఏమిటి? ఒకప్పుడు పత్రికల్లో చదివిన నేరాలు ఇప్పుడు పాడ్‌కాస్టులు, యూట్యూబ్ వీడియోలు, షార్ట్ వీడియోలుగా మారిపోయాయి. ఎవరో ఒకరి దారుణమైన మరణం.. మరొకరికి ఎంటర్టైన్మెంట్ గా మారుతోంది. రక్తపు మరకలు, హత్య వివరాలు, బాధితుల చివరి క్షణాలు.. ఇవన్నీ వ్యూస్ కోసం ప్యాక్ చేయబడుతున్నాయి.
అంటే నావల్ నిజాన్ని వెతుకుతున్నదా? లేక తాను వింటూ వచ్చిన ట్రూ క్రైమ్ కథల ప్రభావంతో ప్రతి జీవితాన్ని ఒక మిస్టరీగా చూడటం మొదలుపెట్టిందా? సినిమా ఈ విషయాన్ని కూడా ప్రశ్నిస్తుంది.చివరకు ఏమైంది…అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
సినిమా చాలా సాదా సీదాగా ఉంటుంది. ఓపిగ్గా చూడాలి. గొప్ప మేకింగ్ ఉండదు. అయితే దర్శకురాలు ఉంటున్న సమాజాన్ని ప్రశ్నించే ధోరణి మాత్రం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దర్శకురాలు అసలు ఆసక్తిని హంతకుడి మీద కాకుండా.. “ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?” అనే ‘ఎందుకు’ మీద పెడుతుంది. పితృస్వామ్యం, మహిళలపై నియంత్రణ, సామాజిక నిర్లక్ష్యం, డిజిటల్ యుగంలోని ట్రూ క్రైమ్ వినోదం.. ఇవన్నీ కథలో ఒకదానితో ఒకటి కలుస్తాయి.అదే సమస్య కూడానూ ఈ కథకు.
కథలో ఇన్విస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నుంచి సోషల్ డ్రామాగా మారుతుంది. అమ్మాయిలు చదువు మధ్యలోనే మానేయడం, పెళ్లి పేరుతో కనిపించకుండా పోవడం, కుటుంబాల నుంచి దూరమవడం వంటి విషయాలను సమాజం ఎంత సులభంగా అంగీకరిస్తుందో సినిమా చూపిస్తుంది.
ఒక యువతి కనిపించకపోయినా “బహుశా పెళ్లి అయి ఉంటుంది” లేదా “చదువు మానేసి ఉంటుంది” అని అనుకోవడం ఎంత ప్రమాదకరమో కథ చెబుతుంది. అందుకే ఇన్విస్టిగేట్ చేస్తున్న ఆమెకు ఈ కేసు ఒక ఉద్యోగ బాధ్యతగా అనిపించదు. ఎవరూ పట్టించుకోని ఒక అమ్మాయికి కనీసం ఒక పేరు తీసుకురావాలనే వ్యక్తిగత పోరాటంగా అనిపిస్తుంది.
అందుకే మర్డర్ మిస్టరీగా ఈ సినిమాని చూస్తే కథలోని కొన్ని విషయాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. హంతకుడు ఎవరు అనే ఉత్కంఠ కంటే.. బాధితురాలి గుర్తింపు, ఆమె చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి.
అలాగే సినిమా చివర్లో ఈ ఆలోచనలన్నింటినీ ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగించాలని ప్రయత్నించడం కొంత ఇబ్బందిగా మారుతుంది. ఫస్టాఫ్ లో చాలా సహజంగా నిర్మించిన సోషల్ కామెంట్.. చివరి మలుపులో కొంత తొందరపాటుగా అనిపిస్తుంది. అసలు సినిమా చెప్పాలనుకున్నది ఏమిటో ప్రేక్షకుడు తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.
టెక్నికల్ గా చూస్తే…
హైఫా అల్-మన్సూర్ దర్శకత్వంలో కూడా ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం కనిపిస్తుంది. సౌదీ సమాజంలోని మహిళల జీవితాలను కేవలం ఎక్స్పోజిషన్ ద్వారా కాకుండా.. వాళ్లు వెళ్లే ప్రదేశాలు, మాట్లాడే విధానం, కుటుంబాల స్పందన వంటి చిన్న చిన్న వివరాల ద్వారా చూపించడానికి ఆమె ప్రయత్నించారు.
మిలా అల్ జహ్రానీ నావల్ పాత్రలో బాగా చేసింది. ఆమె నటనలో ఓవరాక్షన్ లేకుండా, లోపల బాధను దాచుకున్న మహిళగా కనిపించడం పాత్రకు బలం.
ఫైనల్ థాట్
ఒక మనిషిని చంపడానికి ఎప్పుడూ కత్తి అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్లు కనిపించకుండా పోయినప్పుడు పట్టించుకోకపోవడం కూడా ఒక రకమైన హింసే.వాళ్ల గైర్హాజరీని ఎవరూ ప్రశ్నించకపోవడం.. జీవితానికి విలువ లేదన్నట్టుగా వ్యవహరించడం.. చివరకు చనిపోయిన వారి శవానికి పేరు కూడా లేకుండా చేయడం నిజంగా దారుణం అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఇంకాస్త స్ట్రాంగ్ గా చెప్పాల్సి ఉంది.అలా లేకపోవటంతో ఏదో సాదా సీదా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కథకు అల్లిన లేయర్లు గొప్పవే కానీ కలిసొచ్చినవి మాత్రం కాదు.
చూడచ్చా
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్నారు కదా అని థ్రిల్ కోసం చూస్తే మాత్రం నిరాశపరుస్తుంది.
ఎక్కడ చూడవచ్చు
అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది








