శర్వా, శ్రీను వైట్ల మూవీ టైటిల్ ‘జార్జ్ క్రిష్’ – సినిమా గ్రాండ్ గా లాంచ్- జనవరి 14, 2027 సంక్రాంతికి రిలీజ్
‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ‘చార్మింగ్ స్టార్’ శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ATV సమర్పణలో, అనిల్ సుంకర AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.
ప్రత్యేకమైన డిజైన్‌తో వెంటనే దృష్టిని ఆకర్షించేలా ఉన్న కలర్ ఫుల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, ‘జార్జ్ క్రిష్’ చిత్రం 2027 జనవరి 14న పండుగ సీజన్లో విడుదల కానుంది.
ఈ టైటిల్ పోస్టర్ పసుపు-నారింజ రంగుల నేపథ్యంతో, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే సాంప్రదాయ అలంకరణలతో అలరారుతోంది. టైటిల్ బోల్డ్, స్టైలిష్‌గా చేతిరాతలో ఒక ‘అవర్ గ్లాస్’ డిజైన్‌లో, నల్లని బ్రష్-స్ట్రోక్ అవుట్లైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైటిల్ డిజైన్‌లో శర్వా హీరోయిన్ను చేతుల్లోకి ఎత్తుకున్న చిన్న సిల్హౌట్ ను కూడా పొందుపరిచారు, ఇది చిత్రంలోని రొమాంటిక్ అంశాన్ని ప్రజెంట్ చేస్తోంది,
సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ‘జార్జ్ క్రిష్’ చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ లు నిర్మాత సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశారు.
ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా, కిషోర్ గారికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్త థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను ప్రకటించడం విశేషం. ఈ చిత్రాన్ని నిజాం ప్రాంతంలో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, విశాఖపట్నంలో వాసుదేవ మూవీ క్రియేషన్స్, తూర్పు గోదావరిలో వింటేజ్ క్రియేషన్స్, పశ్చిమ గోదావరిలో ఆదిత్య ఫిల్మ్స్, కృష్ణా జిల్లాలో వ్యోమ్ సినిమాస్, గుంటూరులో ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరులో అభి సినిమాస్, సీడెడ్ ప్రాంతంలో శిల్పకళా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను వ్యోమ్ సినిమాస్, సినిమా పారడిసో నిర్వహించనున్నాయి.
సంక్రాంతి సీజన్లో శర్వాకు ఉన్న విజయవంతమైన ట్రాక్ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకున్న పేరు, అలాగేఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్ – వీటన్నింటితో ‘జార్జ్ క్రిష్’ పూర్తిస్థాయి పండుగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ: ఈ సంవత్సరం ‘నారి నారి నడుమ మురారి’ తర్వాత శర్వానంద్ గారితో మళ్ళీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా ప్రియమిత్రుడు శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఈరోజు మొదలైన ఈ మూవీని జనవరి 14న రిలీజ్ చేస్తున్నాము. నేను, శర్వానంద్, శ్రీను వైట్ల గారికి ఇది ఫస్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతితో శర్వా సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడతారు. మళ్లీ సంక్రాంతికి ఈ సినిమా నవ్వులు కురిపిస్తుంది.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ: 14 రీల్స్ లో సినిమాలు చేసినప్పటికీ అనిల్ గారితో కలిసి చేస్తున్న తొలి సినిమా ఇది. నందు అద్భుతమైన కథ ఇచ్చాడు. కథ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 28 నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. శర్వానంద్ గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకు చాలా నచ్చింది. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన నమ్మకం 100 శాతం నిజమవుతుంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీను వైట్ల గారికి, నిర్మాత గారికి, హీరో శర్వానంద్ గారికి థాంక్యూ. ఇది చాలా మంచి మ్యూజికల్ సినిమా. సాంగ్స్ చాలా బాగా వస్తున్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తాం. అందరికీ థాంక్యూ.








