అఖిల్ రాజ్, నాగ దుర్గ, సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ టైటిల్ ‘శనార్తి’
బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది విజయవంతమైన నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, అభిరుచి గల నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ ట్యాలెంటెడ్ నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తెలంగాణ జానపద గీతాలలో తన ఉత్సాహభరితమైన నటనతో పేరుపొందిన నాగ దుర్గకు ఇది తెలుగులో తొలి సినిమా. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి ‘శనార్తి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇది తెలంగాణలో సాంప్రదాయకంగా పలకరించడానికి ఉపయోగించే పదం. టైటిల్ పోస్టర్లో ఒక చేయి పసుపు పచ్చ రంగులో, మరొక చేయి ఎరుపు రంగులో ఒకదానికొకటి పట్టుకున్న రెండు చేతులు.. విభిన్న రంగులు, అనుబంధం, సంప్రదాయం, ఐక్యతను అందంగా సూచిస్తాయి.
రెండు చేతుల మణికట్టు చుట్టూ పవిత్రమైన జంధ్యాలు కట్టి ఉండగా, ఎరుపు రంగు వేసిన చేతికి సాంప్రదాయ ఎర్ర గాజుల దండ అలంకరించబడి ఉంది. పసుపు, కుంకుమ రంగులతో పాటు, ఈ అంశాలు తెలంగాణ ఆచారాలు, వేడుకలు, సంప్రదాయాల వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
టైటిల్ కింద “A Tale of Culture” అనే ట్యాగ్‌లైన్ సినిమా బ్యాక్ డ్రాప్ ని స్పష్టంగా సూచిస్తుంది. సాంస్కృతిక చిహ్నాలను ఆసక్తికరమైన విజువల్ మేళవించి టైటిల్ పోస్టర్ బలమైన ముద్ర వేస్తుంది.
రచయితగా, కథకుడిగా, షోరన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల’ ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘శనార్తి’తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.
తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఆయన అందించే సంగీతం సినిమాలోని గ్రామీణ నేపథ్యానికి సరిగ్గా సరిపోవడమే కాకుండా చిత్రంలోని భావోద్వేగాలను పెంచుతోంది.
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రముఖ సినీ ప్రముఖులు, చిత్ర బృందం సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
చిత్ర బృందం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనుంది. ‘శనార్తి’ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సంపత్ నంది మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఏ సినిమా చేయడానికి అయినా కథ కారణం అవుతుంది. ఈ సినిమా చేయడానికి మాత్రం కథతో పాటు గణేష్ కారణం. గణేష్ చాలా ప్రతిభావంతుడు. తను దర్శకుడు కావడానికి సపోర్ట్ చేసిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఆదిత్య మూవీస్ ఉమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ‘శనార్తి’.. పల్లెటూరిలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు ఉపయోగించే పదం ఇది. ఈ ప్రేమకథకి ఈ పదం అచ్చంగా సరిపోతుంది. అఖిల్‌కి ఈ కథ చాలా నచ్చింది. అలాగే నాగ దుర్గ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి కారణం అఖిల్. ఇందులో హీరోయిన్ పాత్రకు నాగదుర్గ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. నిజంగా ఆమె వీడియోలను చూసినప్పుడు ఈ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనిపించింది. ఇద్దరూ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తారు. చిరంజీవి గారు-శ్రీదేవి గారు, వెంకటేష్ గారు-సౌందర్య గారిని తెరపై చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో.. వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా అంత అందంగా ఉంటుంది. వాళ్లిద్దరి కోసం చాలామంది కథలు రాస్తారని అనుకుంటున్నాను. సురేష్ బొబ్బిలి చక్కని సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. ఇది మనందరి సినిమా.
దర్శకుడు గణేష్ మాట్లాడుతూ: “అందరికీ శనార్తి. సంపత్ నంది గారు నా బలం. ఆయన దగ్గర రచయితగా పనిచేశాను. ఒకరోజు ఈ కథ చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది. అలాగే మా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. అఖిల్ రాజ్, నాగ దుర్గతో మ్యాజిక్ చేయబోతున్నాం. సంపత్ నంది గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మరోసారి ఆయనకు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ: నన్ను నేను ప్రూవ్ చేసుకునే మరో సినిమా అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి ధన్యవాదాలు. ఆయనతో ఎప్పటినుంచో కలిసి పనిచేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా కోసం నా శక్తినంతా పెట్టి వర్క్ చేస్తాను.”
నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ: ఈ వేడుకకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇది అద్భుతమైన కథ. సంపత్ నంది గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
నాగ దుర్గ మాట్లాడుతూ: “నన్ను అభిమానించే అందరూ నేను ఎలాంటి సినిమాతో కనిపించాలని కోరుకుంటున్నారో.. అలాంటి సినిమా ఇది. కచ్చితంగా మీరందరూ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అలాంటి మంచి సినిమా ఇది. నాకు సపోర్ట్ చేసిన సంపత్ నంది గారికి థాంక్యూ. అందరికీ థాంక్యూ సో మచ్.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరి ప్రేమాభిమానాలు కావాలి.








