క్లౌడ్ యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న డీప్-టెక్ సంస్థ క్లౌడ్ యాంగిల్స్ (Cloud Angles) హైదరాబాద్‌లో తన గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్‌ను (జీఈసీ) ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో ఈ కేంద్రం వెయ్యి మంది ఇంజనీర్ల (Engineers)తో విస్తరించనుందని సంస్థ తెలిపింది. దీనిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు (D. Sridhar Babu,) ప్రారంభించారు. డిజిటల్, అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ రంగాలపై ఈ కేంద్రం దృష్టి పెట్టనుంది. గ్లోబల్ క్లయింట్ల కోసం అత్యాధునిక సాంకేతికతను, ఇంజనీరింగ్ నైపుణ్యాలను సంయుక్తంగా అభివృద్ధి చేసే కో-బిల్డ్ మోడల్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్ ద్వారా అమలు చేస్తామని వివరించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో హైదరాబాద్ (Hyderabad) ఒకటిగా నిలిచిందని అన్నారు. గ్లోబల్ వ్యాపారాలకు నగరాన్ని ఆకర్షణీయంగా మార్చే నైపుణ్యాన్ని సామర్థ్యాలను మరింత పెంపొందించడం తమ ప్రస్తుత లక్ష్యం అని తెలిపారు. నైపుణ్యాన్ని మౌలిక వసతులుగా చూస్తామని, క్లౌడ్ యాంగిల్స్ వంటి పెట్టుబడులు అధిక విలువ గల ఇంజనీరింగ్ ఉద్యోగాలను సృష్టిస్తాయని వివరించారు. గ్లోబల్ వ్యాపారాల కోసం సామర్థ్యాలను నిర్మించడానికి కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు. నైపుణ్యం పెంపునకు తాము నిర్మిస్తున్న పర్యావరణ వ్యవస్థపై నమ్మకానికి నిదర్శనమని అన్నారు.








