కోమటిరెడ్డి ‘ఆంధ్రా’ బాణం! కాంగ్రెస్ హైకమాండ్ గుస్సా..?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే నడుస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు గుప్పించడం సహజ రాజకీయ ఎత్తుగడగా భావించవచ్చు. కానీ, అదే బాణాన్ని ఏకంగా అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంధించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షం చేస్తే రాజకీయ విమర్శగా కొట్టిపారేయొచ్చు కానీ, సొంత పార్టీ ఎమ్మెల్యేనే నేరుగా ప్రభుత్వ తీరుపై, ఆంధ్రా నేతల పెత్తనంపై విరుచుకుపడటంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది.
హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ’25 ఏళ్ల పాటల ప్రస్థానం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివారు, కాంగ్రెస్ పార్టీ కోసం కనీసం క్షేత్రస్థాయిలో పనిచేయని వారు వచ్చి నేడు పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారంటూ ఆయన నేరుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి గళం విప్పారు. ఇప్పటికీ తెలంగాణ పాలకులు, నేతలు ఆంధ్రా నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఇన్నేళ్లయినా అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, పేదలకు న్యాయం జరగడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, పాత కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చేలా ఇప్పటి పాలన సాగుతోందంటూ పరోక్షంగా ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు, కాంట్రాక్టుల కేటాయింపులను కూడా ఆయన ఎండగట్టారు. గతంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, 2018లో గెలిచి రాజీనామా చేసిన తనను ఓడించేందుకు నాడు అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపిందని గుర్తుచేశారు. తెలంగాణ ఒకరి సొత్తు కాదని, 60 ఏళ్ల పోరాటం ద్వారా సాధించుకున్నదని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 500 రకాల నిబంధనలు పెట్టిందని ధ్వజమెత్తారు.
అవినీతి ఎమ్మెల్యేలను, డిపాజిట్లు రాని ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని తిరగాల్సిన అవసరం తనకు లేదని, ప్రజలే తన వెన్నంటే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నందునే తాను చాలా విషయాలను నియంత్రించుకుని మాట్లాడుతున్నానని, ఒక్కసారి మాట్లాడటం ప్రారంభిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బహిరంగంగానే హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు తరహా రాజకీయ మార్పును తెలంగాణలో తెస్తామని, నిజాయతీపరులు, ఉద్యమకారులు చట్టసభల్లో అడుగుపెట్టేలా చూస్తామని ప్రకటించారు.
రాజగోపాల్ రెడ్డి ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వంపై, పరోక్షంగా ముఖ్యమంత్రి వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చూసీచూడనట్లు వ్యవహరించింది. పార్టీలోని ఒక వర్గం ఆయన తీరుపై ఫిర్యాదులు చేసినా హైకమాండ్ పెద్దగా స్పందించకపోవడంతో, ఆయన మరింత తీవ్రస్థాయిలో స్వరం పెంచుతున్నారనే చర్చ నడుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక నుంచి మొదలుకొని ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి రాజకీయ అడుగులు ఎప్పుడూ సొంత దారినే ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సొంత ప్రభుత్వ వైఫల్యాలను, ‘ఆంధ్రా పెత్తనం’ ఆరోపణలను స్వయంగా రాజగోపాల్ రెడ్డి బహిరంగ వేదికపై లేవనెత్తడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సారైనా అధిష్టానం ఆయనపై క్రమశిక్షణా చర్యలు లేదా వివరణ తీసుకుంటుందా లేక ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోతుందా అనేది వేచి చూడాలి.








