ఇరాన్ ను బుజ్జగిస్తున్న యూఏఈ.. ఫ్రీజ్ చేసిన బంగారం, ఆస్తులు విడుదల..!
పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడంలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఓవైపు.. భీకర దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు ఇరాన్ సైతం అంతే మొండిగా గల్ఫ్ దేశాలపై దాడులు జరుపుతోంది. దీంతో ఈప్రాంతం కాస్తా శాశ్వత రణక్షేత్రంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ యుద్ధ వాతావరణం నుంచి బయటపడేదెలా..? ఇప్పుడిదే గల్ఫ్ దేశాలకు సమస్యగా మారింది. దీనిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్… తన ప్లాన్ మార్చినట్లు కనిపిస్తోంది.
ఇరాన్ దాడులకు తాము టార్గెట్ కాకుండా ఉండేలా చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఇరాన్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా ఇరాన్ కు రెండు టన్నుల బంగారం , ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల లాంటి అనుకూల అంశాలను చేపట్టింది.
అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల వద్ద ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయి ఉన్నాయి. అలా తమ వద్ద ఉన్న నిధులను విడుదల చేసి, యుద్ధానికి దూరంగా ఉండాలని యూఏఈ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 11, 12 తేదీల్లో అబుధాబి-టెహ్రాన్ మధ్య విమానాలు నడిచాయని తెలుస్తోంది. వీటిలో స్తంభింపజేసిన చేసిన ఇరాన్ నిధులను తరలించినట్లు సమాచారం. జూన్ 8న కూడా ఒక విమానం అబుధాబి నుంచి ఇరాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది. అప్పుడు మూడు బిలియన్ డాలర్లను ఇరాన్‌కు బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా యూఏఈ తరలించిన నిధుల్లో 283 మిలియన్ డాలర్లు విలువైన రెండు టన్నలు బంగారం (Gold) కూడా ఉన్నట్లు సమాచారం.
అలాగే ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను అమ్మేందుకు కూడా యూఏఈ (UAE) అంగీకరించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అవిగాక మరో 14 ప్యాసింజర్ విమానాలు కూడా తిరిగి ఇవ్వనుందట. రెండు ఎయిర్ బస్ విమానాలు ఇరాన్‌కు వెళ్లడానికి ముందు రొమేనియాలోని ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ 30 ప్యాసింజర్ విమానాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ గతంలో చెప్పింది. ఇప్పుడు యూఏఈ నుంచి వెళ్లే విమానాలు ఆ లోటును భర్తీ చేయనున్నాయి.
పశ్చిమాసియాలో ఘర్షణలు ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతాయో తెలియని అనిశ్చితిలో.. తమ భూభాగంపై ఇరాన్ దాడులను నివారించేందుకు యూఏఈ ఈ ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఆమెరికా ఆంక్షలు, యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా మరింత చితికిపోతోంది. ఈ సమయంలో నిధుల బదిలీ వల్ల టెహ్రాన్‌కు కాస్త బలం చేకూరొచ్చని తెలుస్తోంది.








