టీకా షెడ్యూల్ మార్పు.. ట్రంప్ నిర్ణయంపై అమెరికన్ల ఆందోళన..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అనుకున్నదే తడవుగా వాటిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. మరి వాటి పర్యవసానాలపై ఆలోచిస్తారో లేదో అర్థం కాదు.. ఇప్పటివరకూ టారిఫ్ మోతతో ప్రపంచదేశాల్లో ఆందోళనలు రేకెత్తించిన ట్రంప్.. ఇప్పుడు సొంత దేశస్తులను సైతం ఇబ్బందులోకి నెట్టారు. అది టారిఫ్ లతో కాదు.. టీకా షెడ్యూల్ మార్పులతో.. అధ్యక్షుడి నిర్ణయంపై అమెరికన్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో పిల్లల టీకాల సిఫార్సులు, షెడ్యూళ్లలో మార్పులు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. పాత విధానం ప్రకారం- పిల్లలకు వేర్వేరు టీకాలను ఒకేసారి కలిపి ఇచ్చేవారు. దానివల్ల పదేపదే ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా ట్రంప్ నూతన విధానాన్ని ప్రతిపాదించారు ట్రంప్ తాజా ఉత్తర్వుల ప్రకారం టీకా షెడ్యూల్లో మార్పులు…చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది వేర్వేరు టీకాలను వేర్వేరు విభాగాలుగా విభజించింది. అవన్నీ వేయించుకోవాలంటే పిల్లలను చాలాసార్లు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరు పిల్లలకూ అన్ని వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం లేదనీ కొత్త విధానం స్పష్టం చేసింది. దీని ప్రకారం- తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, పోలియో, హిబ్, న్యూమోకోకల్ వ్యాధి, హెచ్‌పీవీ, ఆటలమ్మ వ్యాక్సిన్లను అందరికీ ఇస్తారు. హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, ఆర్ఎస్వీ, మెనింజోకోకల్ వ్యాధి టీకాలను మాత్రం ముప్పు ఎక్కువగా ఉన్నవారికే అందిస్తారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా (ఎంఎంఆర్) వ్యాక్సిన్‌ను కలిపే (ఒకే షాట్‌గా) ఇస్తున్నారు. దాన్ని మూడు వేర్వేరు టీకాలుగా ఇవ్వాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. ఎంఎంఆర్ వేర్వేరు వ్యాక్సిన్లుగా అమెరికా మార్కెట్లో లేనే లేదు. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 90 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి ట్రంప్ ఇంతకుముందు మాట్లాడుతూ.. మూడు వ్యాధులకు కలిపి ఒకేసారి టీకా వేయడం ప్రాణాంతకమన్నారు. ఆయన వ్యాఖ్య అశాస్త్రీయమంటూ వైద్యులు ఖండించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో విమర్శలు వెలువడుతున్నాయి.








