భారత్ పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. వందశాతం పెంపు బిల్లునకు సెనెట్ ఆమోదం..!
భారత్ పై అమెరికా మరోసారి టారిఫ్ కత్తి ఝలిపించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతోన్న వేళ .. వందశాతం టారిఫ్ బిల్లునకు అమెరికా సెనెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పరిణామంతో.. రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian Oil) చేసే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్ మళ్లీ టారిఫ్‌లతో (US Tariffs) విరుచుకుపడేందుకు ముందడుగు పడింది.
ఇటీవల మృతిచెందిన సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ శాంక్షనింగ్ రష్యా (Russia), ఇరాన్ యాక్ట్ 2026ను అమెరికా సెనెట్ 86-11తో ఆమోదించింది. ఆగస్టు 31న ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత అమెరికా అధ్యక్షుడి (Donald Trump) సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై 100శాతం సుంకాలను విధించనున్నారు.
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీనిని ట్రంప్ ఆర్థిక బంకర్ బస్టర్‌గా అభివర్ణించారు. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. మాస్కో నుంచి చమురు దిగుమతులు చేసుకొనే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఇది అమల్లోకి వస్తే భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
గతంలో ఈ టారిఫ్‌లు 500శాతం వరకు ఉండాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఆ తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలతో సుంకాల పరిమితిని సవరించి 100 శాతానికి తగ్గించారు








