మంత్రివర్గ విస్తరణ జాప్యం వెనుక కాంగ్రెస్ వ్యూహం!
తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఇప్పటివరకూ పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆఖరు వరకు లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వంలో ఇప్పటికే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఇటీవల కొండా సురేఖ ఉద్వాసనతో ఆ సంఖ్య మూడుకి చేరింది. ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తారని.. దసరాలోపు విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటనకు వెళ్లడం.. మరోవైపు అధిష్టానం సమయం తీసుకోవాలని భావిస్తుండటంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని అర్థమైపోయింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించే వారికి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ సమీకరణాలు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక వర్గాల సమతుల్యత పాటించడం రేవంత్ సర్కార్‌కు కత్తి మీద సాములా మారింది. ఇటీవల కొండా సురేఖ నిష్క్రమణ తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో బీసీ వర్గాలకు చెందిన మున్నూరుకాపు, పద్మశాలి, గౌడ వర్గాలకు చెందిన ముగ్గురు మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ కేబినెట్ కూర్పులో ప్రాంతీయ, కుల సమీకరణాల ఒత్తిడి అధికార పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేబినెట్లో చోటు దక్కాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. అలాగే లంబాడాల నుంచి కచ్చితంగా ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వరంగల్ నుంచి మాధవరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటినుంచో కేబినెట్ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పేరు కూడా కొత్త టీమ్‌లో వినిపిస్తోంది. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడికి మంత్రివర్గంలో చోటు ఇస్తే, ప్రస్తుత మంత్రులలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ స్థానం లక్ష్మణ్‌కుమార్‌కు దక్కవచ్చనే చర్చ కూడా జరుగుతోంది.
హడావుడిగా కేబినెట్ విస్తరణ చేపట్టడం కంటే రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వేచి చూడాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తే.. ఎన్నికల సమయంలో అసంతృప్తి రగులుతుందనే భయం కూడా పార్టీని వెంటాడుతోంది. అందుకే అలాంటి వాటికి తావివ్వకుండా చూసేందుకే ఈ తాత్సారం జరుగుతోందని స్పష్టమవుతోంది.








