విజయవాడలో పేదలకు చంద్రబాబు పట్టాభిషేకం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ప్రజా సంక్షేమ చరిత్రలోనూ మరో సువర్ణాధ్యాయం లిఖించబడబోతోంది. విజయవాడ(Vijayawada) నగర నిరుపేదల దశాబ్దాల నాటి కలలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ‘పేదలకు పట్టాభిషేకం’ అనే భారీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీన విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని వేలాది నిరుపేద కుటుంబాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు చంద్రబాబు సర్కార్ సర్వం సిద్ధం చేసింది.
గత ప్రభుత్వాల కాలంలో కేవలం హామీలకే పరిమితమైన విజయవాడ ఇళ్ల స్థలాల సమస్యకు చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో ముగింపు పలికారు. ఈ నెల 30న జరగబోయే భారీ బహిరంగ సభలో ఏకంగా 24,057 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను సీఎం చంద్రబాబు స్వహస్తాలతో అందజేయనున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్నో ఎన్నికలు వచ్చినా పరిష్కారం కాని ఈ సుదీర్ఘ నిరీక్షణకు కూటమి ప్రభుత్వం కేవలం కొద్ది నెలల పాలనలోనే చరమగీతం పాడటం విశేషం. తాము నివసిస్తున్న స్థలాలపై తమకు హక్కులు లేక, ఎప్పుడు ఏ ముప్పు వస్తుందోనని భయపడుతూ బతికిన విజయవాడ పేదలకు ఇది నిజంగా పండగ లాంటి వార్త.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన రాజకీయాన్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పట్టాలను పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు భూమి పేరుతో ఊళ్లకు మైళ్ల దూరంలో, కొండల్లో, గుట్టల్లో, లోతట్టు ప్రాంతాల్లో కేవలం ‘కాగితాలు’ ఇచ్చి చేతులు దులుపుకుందని.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పేదలు దశాబ్దాలుగా ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, ఆ విలువైన నగర ప్రాంతాల్లోనే వారికి సంపూర్ణ యాజమాన్య హక్కులతో కూడిన శాశ్వత పట్టాలను ఇస్తున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీనివల్ల ప్రతి పేద కుటుంబానికి రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల విలువైన శాశ్వత ఆస్తి సమకూరనుంది. ఈ నెల 30న జరగబోయే ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏపీ అధికార యంత్రాంగం మరియు కూటమి నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న లబ్ధిదారులందరినీ గుర్తించి, ఎలాంటి వివాదాలు లేని పక్కా లీగల్ పట్టాలను అధికారులు సిద్ధం చేశారు.








