కడపలో పారిశ్రామిక జోరు.. దాల్మియా సిమెంట్స్ కు భూమి కేటాయింపు..!
రాయలసీమ పారిశ్రామిక హబ్‌గా మారుతున్న వైఎస్సార్ కడప జిల్లాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం, కడప జిల్లాలో ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ‘దాల్మియా సిమెంట్స్’ (Dalmia Cements) భారీ విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా పరిశ్రమ విస్తరణకు అవసరమైన 250 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మైలవరం మండలం చిన్నకొమ్మర్ల గ్రామ పరిధిలో ఉన్న దాల్మియా సిమెంట్స్ ప్లాంట్ విస్తరణకు ఈ భూమిని కేటాయించారు. అయితే ఈ కేటాయింపుల్లో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అవలంబించింది. సాధారణంగా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు (Subsidies) కాకుండా, వాస్తవ ఖరీదు ప్రాతిపదికన మాత్రమే ఈ 250 ఎకరాల భూమిని సంస్థకు బదిలీ చేయడం విశేషం. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూనే, ప్రభుత్వ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ భూ కేటాయింపు మరియు కొత్త యూనిట్ స్థాపనతో దాల్మియా సిమెంట్స్ తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోనుంది. ప్రస్తుతం ఉన్న 7.23 MTPA (మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం) నుండి ఏకంగా 9.60 MTPAకు ఉత్పత్తిని పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే దాల్మియా గ్రూప్‌నకు చెందిన అత్యంత పెద్ద ఇంటిగ్రేటెడ్ ప్యాక్టరీగా రూపాంతరం చెందబోతోంది.
సుమారు రూ. 3,100 కోట్ల నుంచి రూ. 3,478 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టబోయే ఈ మెగా విస్తరణ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో దాదాపు 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు పర్యావరణ హితంగా, మరోవైపు స్థానిక యువతకు ఉద్యోగాలే ధ్యేయంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కడప జిల్లా పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుంది.








