ఓటర్లకు భారీ ఊరట.. మీ ఇంటికే బీఎల్వోలు..!
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై వస్తున్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఓటర్లకు ఎంతో లబ్ధి చేకూర్చేలా, పూర్తి పారదర్శకంగా సరికొత్త మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ విడుదల చేశారు. ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తూ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సిస్టమ్ ద్వారా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నోటీసులు అందినవారు తమ వివరాల సవరణ కోసం లేదా రుజువుల కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ రోజువారీ పనులను వదులుకుని ప్రభుత్వ ఆఫీసుల లైన్లలో నిలబడాల్సిన అవసరం అస్సలు లేదు. నోటీసులు జారీ అయిన ప్రతి ఓటరు ఇంటికి క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం బీఎల్వోలే స్వయంగా వస్తారని సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తెలిపారు.
అధికారులే మీ నివాసానికి వచ్చి, ఓటరు వివరాలను ప్రత్యక్షంగా వెరిఫై చేస్తారు. ఓటరు గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ వంటి అవసరమైన ఆధారాలను సేకరించే బాధ్యతను కూడా పూర్తిగా బీఎల్‌వోలకే అప్పగించారు. అధికారులే మీ వద్ద నుంచి డాక్యుమెంట్లు తీసుకుని, వాటిని ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. తద్వారా ఓటర్లపై ఎలాంటి శారీరక, ఆర్థిక భారం పడకుండా, ఎక్కడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ సులభతర విధానాన్ని ఈసీ అమల్లోకి తెచ్చింది.








