‘లయన్ కింగ్’ డైరెక్టర్ కొత్త సినిమా, స్టోరీ ఏంటో తెలుసా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
‘ది లయన్ కింగ్’, ‘స్టూవర్ట్ లిటిల్’ వంటి అద్భుతమైన సినిమాలతో కార్టూన్ పాత్రలకు కూడా మనసును తాకే భావోద్వేగాలు ఉంటాయని నిరూపించిన దర్శకుడు రాబ్ మింకాఫ్ (Rob Minkoff). ఆయన నుంచి ఒక కొత్త సినిమా వస్తోందంటేనే సినిమా ప్రేమికుల్లో ఏదో తెలియని ఆసక్తి మొదలవుతుంది. అయితే ఈసారి ఆయన తీస్తున్న ‘స్టార్మ్ డాగ్స్’ (Storm Dogs) అనే సినిమా కేవలం ఒక కథగా మాత్రమే కాకుండా, ఫిల్మ్‌మేకింగ్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద విప్లవానికి బాటలు వేసేలా కనిపిస్తోంది.
ఐదు కుక్కలు.. ఒక చిన్నారి.. 24 గంటల పోరాటం!
ఈ సినిమా కథ ఒక ప్రశాంతమైన ఇంగ్లిష్ గ్రామంలో మొదలవుతుంది. అనుకోకుండా విరుచుకుపడిన భయంకరమైన తుఫాను వల్ల పాపీ అనే రెండేళ్ల చిన్నారి తన పెద్దల నుంచి విడిపోతుంది. అంత పెద్ద వరదల్లో, ధ్వంసమైన వంతెనల మధ్య ఆ పసిపాపను కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ఐదు కుక్కల పైపడుతుంది. విశేషమేమిటంటే, ఆ ఐదు కుక్కలకు ఒకటంటే ఒకదానికి పడదు.
కానీ ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తమ సహజ స్వభావాలను, గొడవలను పక్కనపెట్టి అవి ఎలా ఒకటయ్యాయనేదే ఈ కథ. ఒక సాధారణ రెస్క్యూ మిషన్లా మొదలైన ఈ 24 గంటల ప్రయాణంలో, ఆ ఐదు కుక్కలు ఒక కుటుంబంగా మారే క్రమం ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తుంది. చివరికి కుక్కలంటే అస్సలు పడని ఆ చిన్నారి తల్లి కూడా వాటిని చూసే కోణమే మారిపోతుంది.
కథ ఓకే.. మరి అసలు విషయం ఏంటి?
నిజానికి కథ వినడానికి చాలా బాగున్నప్పటికీ, ఈ సినిమా వార్తల్లో నిలవడానికి అసలు కారణం దీన్ని షూట్ చేస్తున్న విధానమే! ఇందులో మనుషుల పాత్రలను మామూలుగానే లైవ్ యాక్షన్‌లో షూట్ చేస్తారు. కానీ చిన్నారి పాపీ, అలాగే ఆ ఐదు కుక్కల పాత్రలను మాత్రం ఫోటోరియలిస్టిక్ యానిమేషన్ ద్వారా సృష్టిస్తున్నారు. ఇందుకోసం లైవ్ యాక్షన్ పర్ఫార్మెన్స్, పాతతరం ఫిల్మ్‌మేకింగ్ మెథడ్స్ తో పాటు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. AI నటి ‘టిల్లీ నార్వుడ్’ను సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ‘పార్టికల్ 6’ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
కుక్క పాత్ర వెనుక ఉన్న నటుడు ఎవరు?
ఇప్పటివరకు ఏఐ టెక్నాలజీ అనగానే “ఇది నటుల ఉద్యోగాలను తీసేస్తుందా?” అనే చర్చ నడిచింది. కానీ రాబ్ మింకాఫ్ ఈ సినిమాతో “నటుడి శరీరం లేకుండానే అతని నటనను ఉపయోగించవచ్చా?” అనే ఒక కొత్త ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఒక నటుడు ఇచ్చే హావభావాలు, నడక, భయం, ప్రేమ, ఫిజికల్ టైమింగ్ వంటి ప్యూర్ ఎమోషన్స్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ మొత్తం ‘నటన’ను డిజిటల్ యానిమేషన్ కుక్క పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే తెరపై మనకు కనిపించేది కుక్కే అయినప్పటికీ, దాని వెనుక ఉన్నది మాత్రం ఒక నటుడి అసలైన హావభావాలు, ఆత్మ మాత్రమే!
పాత అనుభవం.. కొత్త టెక్నాలజీ!
‘ది లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా, సింబా, స్కార్ వంటి పాత్రలు యానిమేషన్ ద్వారానే వచ్చినప్పటికీ, ప్రేక్షకులు వాటిని తమ స్వంత మనుషుల్లా భావించి కనెక్ట్ అయ్యారు. దశాబ్దాల క్రితమే యానిమేషన్ పాత్రలతో అంతటి మేజిక్ చేసిన రాబ్ మింకాఫ్కు, ఇప్పుడు ఏఐ మరియు లైవ్ పర్ఫార్మెన్స్ తోడవ్వడం పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఏఐని నటుడికి ప్రత్యామ్నాయంగా చూడకుండా, డైరెక్టర్ ఊహలకు సరికొత్త రెక్కలు తొడిగే ఒక సాధనంగా మాత్రమే వాడుతున్నామని నిర్మాతలు కూడా స్పష్టం చేస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడు!
ఈ సినిమా ప్రొడక్షన్ 2027లో ప్రారంభం కానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. 2027లోనే వస్తుందని కూడా చెప్పలేం. అయితే అభిమానుల ఎదురుచూపులు అప్పుడే మొదలైపోయాయి. కథ పరంగా ఇది ఒక చిన్నారిని కాపాడే ఐదు కుక్కల అడ్వెంచర్ డ్రామా అయినప్పటికీ, టెక్నాలజీ పరంగా మాత్రం భవిష్యత్తు సినిమా రంగానికి ఇదొక ప్రాక్టికల్ ప్రయోగశాల కాబోతోంది. ఒక నటుడి ఎమోషన్ డిజిటల్ పాత్రలోకి మారినప్పుడు అది ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పిస్తుంది? ఆ పాత్రలో నటుడి ఉనికి కనిపిస్తుందా లేదా? అనే ప్రశ్నలకు ఈ ‘స్టార్మ్ డాగ్స్’ ఏ రకమైన సమాధానం ఇస్తుందో చూడాలి.








