నెల్లూరులో పామాయిల్, సోయాబీన్ రిఫైనరీలను ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ చైర్మన్ కనుభాయ్ ఠక్కర్ తో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): ఎడిబుల్ ఆయిల్స్, ఒలియో కెమికల్స్, బయో డీజిల్ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ కనుభాయ్ జె.ఠక్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కంపెనీ ప్రస్తుత నెల్లూరు ప్లాంట్‌కు విస్తరణగా, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గోకుల్ ఆగ్రోస్ తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను విశ్వసించినందుకు అభినందనలు తెలిపారు. గోకుల్ ఆగ్రోస్ చైర్మన్ కనుభాయ్ ఠక్కర్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో రోజుకు 1,400 టన్నుల (TPD) సామర్థ్యం గల వంట నూనె రిఫైనరీ ప్లాంట్ ను సంస్థ స్థాపించింది, ఇది 2024 నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం కాండ్ల (గుజరాత్), కృష్ణపట్నం (ఎపి), హల్దియా (పశ్చిమ బెంగాల్), మంగుళూరు (కర్నాటక)లలో తమ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. దక్షిణాది మార్కెట్లకు సేవలు అందించేందుకు తమవద్ద విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.








