స్థానిక ఎన్నికలకు జనసేన పక్కా స్కెచ్..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన(Janasena) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కూటమి భాగస్వామ్య పక్షాలతో పక్కా సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త కమిటీ ఇప్పటికే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న 14 మంది సభ్యుల ప్రధాన కమిటీతో కలిసి సంయుక్తంగా పని చేయనుంది. ఈ ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించనుంది. వివిధ జిల్లాల్లో పార్టీ బలాబలాలు, డివిజన్లు మరియు స్థానిక సంస్థల వారీగా అభ్యర్థుల గెలుపు అవకాశాలు, పొత్తుల సమన్వయంలో ఎదురవుతున్న సవాళ్లపై లోతుగా అధ్యయనం చేసి ఈ ప్రత్యేక టీమ్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఈ కమిటీలు క్షేత్రస్థాయి నుంచి సేకరించి సమర్పించే నివేదికల ఆధారంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదికల ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, సీట్ల సర్దుబాట్లపై పవన్ కల్యాణ్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ సీట్ల పంపకాలపై కూటమిలో అంతర్గత చర్చలు నడుస్తున్న తరుణంలో జనసేన ఈ ప్రత్యేక కమిటీని రంగంలోకి దించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.








