టీమిండియా సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ సంచలన నిర్ణయం..!
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) తన సుదీర్ఘ డొమెస్టిక్ కెరీర్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత డొమెస్టిక్ సీజన్లో విదర్భ (Vidarbha) జట్టుతో తన బంధాన్ని తెంచుకుంటూ, ఆ అసోసియేషన్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం అతను విదర్భ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పటికే అధికారికంగా ‘నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ను కూడా పొందాడు. 38 ఏళ్ల ఈ సీనియర్ స్పీడ్‌స్టర్ విదర్భ జట్టును వీడటానికి సెలెక్టర్లతో తలెత్తిన కమ్యూనికేషన్ గ్యాప్ ప్రధాన కారణమని తెలుస్తోంది.
గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించిన తర్వాత, జట్టులో తన పాత్ర ఏంటనే దానిపై క్లారిటీ ఇవ్వాలని విదర్భ సెలెక్షన్ ప్యానెల్‌ను ఉమేష్ కోరినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. స్థానిక విదర్భ టి20 ప్రీమియర్ లీగ్‌లో ఆడినప్పటికీ, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఉమేష్ యాదవ్ మరో రెండు, మూడు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే తన కొత్త డొమెస్టిక్ జట్టును ప్రకటిస్తారని సమాచారం.
ఉమేష్ యాదవ్ భారత్ తరఫున చివరిగా జూన్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. టీమిండియా తరఫున మొత్తం 57 టెస్టుల్లో 170 వికెట్లు పడగొట్టిన అతను, స్వదేశంలో ఆడిన 32 టెస్టుల్లోనే 101 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన హోమ్ బౌలర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 288 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 2015 వన్డే వరల్డ్ కప్‌లో 18 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రాణించాడు. ఇక విదర్భను వీడి ఉమేష్ యాదవ్ కెరీర్ లో ఎలాంటి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడో చూడాలి.








