దెయ్యాలు ఫుల్, కామెడీ నిల్: ‘మహారాజా హాస్టల్’ మూవీ రివ్యూ
Rating: 2
—సూర్య ప్రకాష్ జోశ్యుల
అరవింద్, మిథున్, వర్కి మిడిల్ క్లాస్ మేధావులు. వీళ్ళు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయినా, ఆర్దిక శాస్త్రంలో మంచి పట్టు ఉన్నవాళ్లు. ఎంత పట్టు అంటే…తల్లి తండ్రులు పంపే డబ్బులో కొంత మిగుల్చుకోవటానికి దేశ బడ్జెట్ స్దాయిలో ఆర్దిక ప్రణాళికలు వేస్తూంటారు.ఆ ప్రణాళిక అమలులో భాగంగా ఓ పనికి మాలిన హాస్టల్ ని ఎంచుకుంటే డబ్బులు తక్కువకు వస్తుంది. చాలా డబ్బులు మిగులుతాయని లెక్కలేస్తారు. అక్కడితో ఆగకుండా అలాంటి హాస్టల్ ని వెతికి మరీ పట్టుకుంటారు.
ఇదంతా చూసి అయ్యో మిడిల్ క్లాస్ మెలోడీస్, పాపం బిడ్డలు ఎంత బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తుంది. అయితే ఆ మిగిలే డబ్బులతో తాగి తందనాలు ఆడాలని అంటున్నారు అని తెలిసాక కూడా మనకు అదే సానుభూతి ఉంటుందా లేదా అన్నది చూడాలి. అయినా ఇలాంటి భారీ ప్రణాళికలు వేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి.
సరే… వాళ్లు తమ డబ్బు ఆదా చేయడానికి ఎంచుకున్న హాస్టల్లో సౌకర్యాలు సున్నా. వాళ్లు ఇష్టపడి దూరుతున్నది కాబట్టి అది పెద్ద సమస్యే కాదు. సౌకర్యాలు లేకపోతే అలవాటు పడొచ్చు. నీళ్లు లేకపోతే బకెట్ తెచ్చుకోవచ్చు. కరెంట్ లేకపోతే కొవ్వొత్తి పెట్టుకోవచ్చు. కానీ ఆ హాస్టల్లో వార్డెన్ చనిపోయి దెయ్యంగా తిరుగుతూ ఉంటే?ఇది మాత్రం కొంచెం ఎడ్జెస్ట్ అవ్వాలంటే కాస్త కష్టమే.
అయితే వార్డెన్ తాను దెయ్యం అని చెప్పనంత సేపూ ….లేదా వార్డెన్ .. దెయ్యమని వీళ్లకి తెలియని అంతసేపూ ఏ సమస్యా లేదు. తెలిసిన తర్వాత కూడా మరో హాస్టల్ అదీ లో బడ్జెట్ లో వెంటనే దొరకాలి కదా… అందుకే వాళ్లు అక్కడే కంటిన్యూ అవుతూంటారు. ఇందులో తప్పు పట్టాల్సిన విషయం ఏమి లేదు. నిజానికి అప్పులు, కొత్త హాస్టల్ ని తమ బడ్జెట్ లో వెతకటం వంటి పెద్ద విషయాలు కన్నా దెయ్యాలేమీ పెద్ద భయపెట్టేవేమి కావు. ఎందుకంటే దెయ్యాలు భయపెట్టడానికి ఓ పాట్రన్ ఉంటుంది. కానీ ఆర్దిక కష్టాలకు అలాంటి రూల్స్ ఏమి ఉండవు.
ఇది ఇలా ఉంటే..వాళ్లు చదివే కాలేజీలో ఓ గ్యాంగ్ ఉంటుంది. అది జూనియర్స్ కి ర్యాగింగ్ పేరుతో టెస్ట్ లు పెడుతూంటుంది.అలా ఓ సీనియర్ స్టూడెంట్ వీళ్ల ముగ్గురికీ ఓ ఛాలెంజ్ విసురుతాడు. అదేమింటే వీళ్లు ముగ్గురూ దగ్గరలోని దట్టమైన అడవిలోకి వెళ్లి ఓ ఎర్రటి వస్త్రాన్ని తీసుకురావాలి.
అలాంటప్పుడు మామూలుగా ఎవరైనా ఏమంటారు? “సారీ కాకా ..నాకు భయం నేను వెళ్లను” అంటాడు .కానీ వీళ్లు ముగ్గురికి తాము అడివికి వెళ్లకపోతే కథ కదలదు అని తెలుసు. అందుకే మరో ఆలోచన లేకుండా అడవిబాట పట్టారు. అడవిలోకి వెళ్లి వచ్చేస్తే కిక్ ఏముంటుంది…ఏదో ఒక జ్ఞాపకం ఉండాలి అన్నట్లుగా అక్కడున్న ఒక మానవాతీత శక్తిని నిద్రలేపుతారు. నిద్ర డిస్ట్రబ్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా.. అది వాళ్లను వెంటాడటం మొదలెట్టింది. వాళ్లు దాని నుంచి తప్పించుకుని హాస్టల్‌కు తిరిగి వచ్చారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్. బయట అడవి దెయ్యం ఉంది. లోపల వార్డెన్ దెయ్యం ఉంది.
ఇప్పుడు ఈ రెండింటికన్నా పెద్ద సమస్య వీళ్లని ఊపేస్తుంది. అదేమిటి అంటే..ముందుగా ఏ దెయ్యంతో మాట్లాడాలి? ఒకరితో మాట్లాడితే మరొక దెయ్యం ఫీలవుతుందా. దానికి తోడు రెండు దెయ్యాలు రెండు వెర్షన్స్ రన్ చేస్తున్నాయి.
బయట ఉన్న దెయ్యం ప్రాణం తీస్తానంటోంది. లోపల ఉన్న వార్డెన్ దెయ్యం హాస్టల్ రూల్స్ పాటించమంటోంది. అంటే ఒకటి వాళ్ళను చంపాలనుకుంటోంది. మరొకటి చనిపోయి కూడా రూల్స్ గురించి పట్టించుకుంటోంది. దాంతో ఈ ముగ్గురూ ఈ రెండు దెయ్యాల నుంచి ఎలా బయిటపడ్డారు.చివరకి ఏమైంది అన్నదే ఈ కథ.
ఎనాలసిస్ :
ఈ రోజుల్లో ప్రేక్షకుడు రోజుకు వందల షార్ట్ వీడియోలు చూస్తున్నాడు. ఒక కథలో ఒక పాత్రను ఒక రకంగా పరిచయం చేస్తే, ప్రేక్షకుడు దాని వెనుక ఉన్న ట్విస్ట్‌ను వెంటనే చదివేసే స్దాయికి వచ్చేసాడు. కానీ దర్శకుడు, స్క్రిప్ట్ రాసిన రచయిత మాత్రం “ఇది మా సస్పెన్స్ ” అని అనుకుంటుంది. ఇక్కడే రచయిత-ప్రేక్షకుడి మధ్య టైమింగ్ మిస్ అవుతోంది.
రచయితకు ఒక విషయం కొత్తగా అనిపిస్తోంది. ప్రేక్షకుడికి అది ఇప్పటికే తెలిసిపోయింది.ఇంకేముంది సినిమా చచ్చిపోతుంది. స్క్రీన్‌ప్లేలో ట్విస్ట్ అంటే ప్రేక్షకుడికి తెలియని సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు. ప్రేక్షకుడికి తెలిసిన సమాచారాన్ని పాత్రకు తెలియకుండా ఉంచడం కూడా కావచ్చు. అలా చేస్తే టెన్షన్ వస్తుంది.
ఈ సినిమాలో మాత్రం ప్రేక్షకుడు ముందే ఊహించిన విషయాన్ని సినిమా తర్వాత రివీల్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. దాంతో suspense బదులు “అది నాకు ఎప్పుడో అర్థమైంది కదా” అనే ఫీలింగ్ వస్తుంది.
అంతెందుకు…
ఒక దెయ్యం బయట ఉంది. మరో దెయ్యం వాళ్లు ఉంటున్న హాస్టల్లో ఉంది. ఇదే స్క్రీన్‌ప్లే తో ఆడుకునే వాళ్లకు గోల్డ్ మైన్. ఎందుకంటే ఇది రొటీన్ గా.. మనుషులు vs దెయ్యం కథ కాదు. దెయ్యం vs దెయ్యం vs ముగ్గురు మనుషులు కథ. ఈ రెండు దెయ్యాల మధ్య పాత శత్రుత్వం ఉందా? వాళ్లిద్దరికీ వేర్వేరు లక్ష్యాలున్నాయా?, హాస్టల్ దెయ్యం నిజంగా ఈ కుర్రాళ్లను కాపాడాలనుకుంటుందా, లేక తన స్వంత ప్రయోజనం కోసం వాళ్లను ఉపయోగించుకుంటోందా?
ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యే క్షణంలోనే కథకు second layer వస్తుంది. అదే Romancham లాంటి హారర్-కామెడీల్లో వర్కవుట్ అయిన విషయం. హారర్ ఒక లేయర్. దాని మీద మనుషుల ప్రవర్తన మరో లేయర్. అయితే ఇక్కడ స్క్రీన్‌ప్లే ఆ అవకాశాన్ని పట్టుకుని ముందుకు వెళ్లకుండా, మళ్లీ “దెయ్యం వచ్చింది—భయపడాలి—పరుగెత్తాలి” అనే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి, మనని నిద్రలోకి పంపేస్తుంది.
చూడచ్చా?
మరీ కాలక్షేపం లేక, బోర్ కొట్టినా ఫరవాలేదు..మనకున్న బోర్ తో పోలిస్తే ప్రపంచంలో ఏదీ మనని బోర్ కొట్టించలేదు అనుకున్నప్పుడు ఓ లుక్కేయండి.
ఫైనల్ థాట్..:
ఈ సినిమా దెయ్యాలను సృష్టించింది. కానీ వాటికి పని ఇవ్వలేదు. దాంతో అవి చూసేవాళ్లను తినేయటం మొదలెట్టాయి.








