ఈ సందర్భాల్లో ఒక్క మాట కూడా మాట్లాడకండి.. మౌనమే మీ బలం!
కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి, మరి కొన్ని సందర్భాలు అటూ ఇటూ కాకుండా తల ఊపాల్సి వస్తుంది, మరి కొన్ని సందర్భాల్లో మౌనంగా వుండిపోవాల్సి వస్తుంది. అయితే.. మరి కొందరు మాత్రం ‘‘మౌనం’’ అంటూ ప్రత్యేకంగా అలవాటు కూడా చేసుకుంటుంటారు. ఇది ఆధ్యాత్మిక వికాసానికి బాగా ఉపకరిస్తుంది. ఇదెలా వుంటే.. జీవితంలో కొన్ని సందర్భాలలో మాట్లాడటం కంటే మౌనంగా వుండటమే ఉత్తమం, ఎక్కువ గౌరవాన్ని, ప్రశాంతతను కూడా ఇస్తుంది.
మౌనం ఇచ్చే మానసిక బలం

మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తిమంతులవుతారని అనుభవజ్ఞులు చెబుతారు. ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తిస్థాయిలో రక్షించుకోగలుగుతారు. అసలు సిసలైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మరి రోజూ ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆ తరువాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తే విమర్శకులకు దీటుగా, కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పినట్టు అవుతుంది. మిమ్మల్ని చిన్నబుచ్చాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమవుతాయి.
ఇవి కూడా చదవండి
మౌనంగా ఉండాల్సిన సందర్భాలు

కోపంలో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటలు ఇతరులను గాయపరచవచ్చు. అందుకే శాంతించే వరకు మౌనంగా ఉండటం మంచిది. ఎవరైనా తమ బాధను పంచుకుంటున్నప్పుడు మధ్యలో సలహాలు ఇవ్వకుండా శ్రద్ధగా వినాలి. అలాగే విషయంపై పూర్తి అవగాహన లేనప్పుడు మాట్లాడకుండా ఉండటం మంచిది. మాటల వల్ల బంధాలు దెబ్బతినే పరిస్థితుల్లో కూడా మౌనం వహించడం ఉత్తమం.
మన మాటలు వినడానికి సిద్ధంగా లేని వారికి పదే పదే వివరించడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ఇతరుల కుటుంబ, వ్యక్తిగత సమస్యల్లో అనవసరంగా సలహాలు ఇవ్వకపోవడం మంచిది. ఈరోజు గొడవపడిన కుటుంబీకులు రేపు కలిసిపోవచ్చు. అప్పుడు మన సలహానే సమస్యకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.








