అమెరికాలో ఉద్యోగం పోయిందా? బ్యాగ్ సర్దుకోండి! H-1B ఉద్యోగులకు భారీ షాక్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక రోజు ఊహించనివిధంగా ఈ మెయిల్ వస్తుంది.
“Your position has been eliminated.”
అంతే. అమెరికాలో అన్నేళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఒక్కసారిగా ముగిసిపోయింది.అసలు టెన్షన్ ఉద్యోగం పోయినందుకు మాత్రమే కాదు. ఇంటి అద్దె, పిల్లల స్కూల్, కారు లోన్, కుటుంబ ఖర్చులు అన్నీ ఒకవైపు ఉంటే.. మరోవైపు ఒక పెద్ద ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది.
“ఉద్యోగం లేకుండా అమెరికాలో ఎంతకాలం ఉండచ్చు?”
ఇన్నాళ్లూ ఆ ప్రశ్నకు ఒక సమాధానం ఉండేది—60 రోజులు. ఆ 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు. మరో కంపెనీతో H-1B పిటిషన్ దాఖలు చేయించుకోవచ్చు. అమెరికాలోనే ఉండి తదుపరి అడుగు వేయొచ్చు. కానీ ఆ 60 రోజుల సేఫ్టీ నెట్‌ను తొలగించాలని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తోంది.
అదే జరిగితే.. ఉద్యోగం పోయిన తర్వాత పరిస్థితి చాలా సింపుల్‌గా ఇలా మారిపోవచ్చు: ఉద్యోగం పోయింది.. బ్యాగ్ సర్దుకోవాల్సిందే.
60 రోజుల గడువుకు అమెరికా చెక్?
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) “Eliminating the Discretionary 60-day Grace Period” పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1Bతో పాటు కొన్ని ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఉన్న విదేశీ ఉద్యోగులకు ఉద్యోగం ముగిసిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంది.
ఆ సమయం ఉద్యోగం వెతుక్కోవడానికి మాత్రమే కాదు. కొత్త యజమాని ద్వారా పిటిషన్ వేయించుకోవడానికి, వీసా స్టేటస్ మార్చుకునేందుకు ప్రయత్నించడానికి లేదా అమెరికా నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు DHS ఈ సౌకర్యాన్ని తొలగించాలని చూస్తోంది. ఇదే అమలులోకి వస్తే…ఉద్యోగం మారడం అనే సాధారణ కెరీర్ నిర్ణయం.. ఇమ్మిగ్రేషన్ సమస్యగా మారుతుంది.
కంగారుపడకండి… ఇది ఇంకా పూర్తిగా రూల్ గా రాలేదు. ప్రతిపాదనపై ప్రజల నుంచి 60 రోజుల పాటు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుంది.
భారతీయ టెక్ ఉద్యోగులకు ఎందుకు టెన్షన్?
అమెరికా టెక్ రంగంలో H-1Bపై పనిచేస్తున్న భారతీయ నిపుణులు భారీ సంఖ్యలో ఉన్నారు. సాఫ్ట్వేర్, ఐటీ, ఇంజినీరింగ్, డేటా, ఏఐ వంటి రంగాల్లో అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులపై ఆధారపడుతున్నాయి. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొత్త విషయం కాదు.
ఒక కంపెనీ తన ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే.. ఉద్యోగి పనితీరు బాగున్నా ఉద్యోగం తీసేయచ్చు. అమెరికన్ ఉద్యోగికి అది ఒక ఉద్యోగ సమస్య. కానీ H-1B ఉద్యోగికి? అది ఉద్యోగ సమస్యతో పాటు ఇమ్మిగ్రేషన్ సమస్య కూడా. అందుకే ఆ 60 రోజులు అంత ముఖ్యమైనవి.
మామూలుగా ఆ 60 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది?
ఒక H-1B ఉద్యోగి ఉద్యోగం కోల్పోయినప్పుడు అతని చేతిలో ఉన్న సమయం విలువైనదే. కొత్త కంపెనీలకు అప్లై చేయాలి. ఇంటర్వ్యూలు పూర్తి చేయాలి. ఆఫర్ రావాలి. కొత్త కంపెనీ H-1B పిటిషన్ దాఖలు చేయాలి. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముందుకు సాగాలి. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని రోజుల్లో పూర్తవుతుందని గ్యారంటీ లేదు. అందుకే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉద్యోగికి ఒక బఫర్ టైమ్. ఆ బఫర్ తొలగిపోతే, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఉన్న సమయం మాత్రమే కాదు.. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా తగ్గిపోతుంది.
ఇక్కడ మరో భయం ఉంది
గ్రేస్ పీరియడ్ తొలగిస్తే కొంతమంది విదేశీ ఉద్యోగులకు Notice to Appear (NTA) జారీ చేసే పరిస్థితి రావచ్చని ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ Fragomen పేర్కొంది. NTA అంటే అమెరికా నుంచి తొలగింపు ప్రక్రియను ప్రారంభించే ప్రభుత్వ నోటీసు. ప్రత్యేకంగా H-1B, O-1 వంటి కొన్ని కేటగిరీల్లో ఉద్యోగం ముగిసిన విషయాన్ని ప్రభుత్వం వెంటనే తెలుసుకునే పరిస్థితి ఉండటంతో ఈ అంశం మరింత కీలకం కావచ్చు.
అంటే ఉద్యోగం పోయిన తర్వాత ఎదురయ్యే ప్రశ్న కేవలం:
“తర్వాత ఉద్యోగం ఎక్కడ?” కాదు. “అమెరికాలోనే ఉండగలనా?” అనేదీ అవుతుంది.
ఈ నిబంధనను ఎందుకు తీసుకొచ్చారు?
ఇప్పటి 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 2016లో ప్రవేశపెట్టారు. దాని ఉద్దేశ్యం..అమెరికాలో పనిచేస్తున్న హై-స్కిల్డ్ విదేశీ నిపుణులు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూడటం. దీంతో ఉద్యోగులకు కొత్త కంపెనీ వెతుక్కునే అవకాశం వచ్చింది. కంపెనీలకు కూడా విదేశీ నిపుణులను ఒక యజమాని నుంచి మరో యజమానికి మార్చుకోవడం సులభమైంది.
ఇప్పుడు DHS మాత్రం విదేశీ ఉద్యోగి నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌ను అతను అమెరికాకు వచ్చినప్పుడు చూపించిన నిర్దిష్ట ఉద్యోగం లేదా కార్యకలాపంతో నేరుగా అనుసంధానించాలి అని చెబుతోంది. అంటే ఉద్యోగం ముగిసింది అంటే.. అమెరికాలో ఉండటానికి ఉన్న ఆధారం కూడా ముగిసినట్టే అన్న భావనను ప్రభుత్వం ముందుకు తెస్తోంది.
వేలాది మంది జీవితాలకు సంబంధించిన మార్పు
DHS గణాంకాల ప్రకారం, ఉద్యోగం ముగిసిన లేదా స్వచ్ఛందంగా యజమానిని మార్చుకున్న ప్రధాన నాన్-ఇమ్మిగ్రెంట్ లబ్ధిదారుల సంఖ్య 2025లో 65,752. 2023లో ఈ సంఖ్య 80,034కి చేరింది. 2021 నుంచి 2025 మధ్య ఉద్యోగం కోల్పోయిన లేదా యజమాని మార్చుకున్న 3,28,758 మంది ప్రధాన లబ్ధిదారుల్లో కేవలం 5.77 శాతం మందికే కొత్త యజమాని ద్వారా కొత్త నాన్-ఇమ్మిగ్రెంట్ పిటిషన్ దాఖలైనట్లు DHS అంచనా వేసింది.
ఫైనల్ గా..
H-1B వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉద్యోగం శాశ్వతంగా సేఫ్ అని అర్థం కాదు. ఇది ఒక నిర్దిష్ట ఉద్యోగంతో ముడిపడి ఉన్న నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్. అందుకే ఉద్యోగం పోయినప్పుడు ఆ వ్యక్తి అమెరికాలో ఉండే హక్కు కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటివరకు ఆ రెండు పరిణామాల మధ్య 60 రోజుల గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్‌ను తొలగించాలన్నదే ఇప్పుడు అమెరికా ప్రభుత్వ ప్రతిపాదన.








