వయాగ్రా లాంటి ‘పవర్ పిల్స్’ వాడుతున్నారా? కళ్లకు దెబ్బా? కొత్త స్టడీ”
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక మందు ఉంది. దాని పని చాలా సింపుల్ . శరీరం స్పందించాల్సిన చోట స్పందించేలా చేయడం. అందుకే చాలామంది దాన్ని పూర్తిగా నమ్ముకుని వాడుతుంటారు. జీవితాలను లాగుతూంటారు. హమ్మయ్య..సమస్య తగ్గింది.. టెన్షన్ తగ్గింది.. అంతా బాగానే ఉందనుకుంటారు. కానీ అదే మందు గురించి ఇప్పుడు మరో సమస్య మొదలైంది. ఇదేదో భయపెట్టడానికి చెప్పే విషయం కాదు. సైన్స్ లో బయిటపడ్డ విషయం చెప్పే ప్రయత్నం.
“ఆ మందు కళ్లపై కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుందా?”
ఇదే ఇప్పుడు పరిశోధకులను ఆలోచింపజేస్తున్న విషయం. వయాగ్రా పేరుతో అందరికీ తెలిసిన సిల్డెనాఫిల్, అలాగే అదే తరహాకు చెందిన టడలాఫిల్ వంటి మందులపై జరిగిన కొత్త అధ్యయనం..షాకింగ్ రిజల్ట్స్ ని ఇచ్చింది. దీర్ఘకాలం క్రమం తప్పకుండా టడలాఫిల్ వాడే కొందరిలో గ్లాకోమా అనే కంటి వ్యాధి వచ్చే ప్రమాదం కొంత పెరగొచ్చని సూచించింది.
భయపడాల్సిన పని లేదు.
ఎందుకంటే ఈ స్టడీ “వయాగ్రా లేదా ఇలాంటి మరో పవర్ మందు వాడితే చూపు పోతుంది” అని ఖరారుగా చెప్పలేదు.
లైంగిక పక్రియకు కళ్లకు సంబంధం ఏంటి?
మన దగ్గర చిన్నప్పటి నుంచి వినిపించే ఓ పాత మాట ఉంది. “ఎక్కువ శృంగారం చేస్తే చూపు పోతుంది.” ఇది పెద్ద అపోహ అని, సైన్స్ ఈ మాటను ఎప్పుడో పక్కన పెట్టేసింది. లైంగిక చర్య వల్ల మనిషికి అంధత్వం వస్తుందనడానికి ఆధారం లేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం వేరు.
లైంగిక చర్య కాదు.. దాని కోసం వాడే కొన్ని మందుల దీర్ఘకాల ప్రభావాలపై ఒకసారి దృష్టి పెట్టాల్సి రావొచ్చేమో. ఇదే మేటర్ లో వయాగ్రా, సియాలిస్ లాంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అసలు స్టడీలో ఏం తేలింది?
పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన పురుషుల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వారిలో గతంలో గ్లాకోమా లేని 36,927 మంది క్రమం తప్పకుండా టడలాఫిల్ వాడుతున్నవారిని గుర్తించారు. వారితో సమానమైన మరో 36,927 మంది మందు వాడని పురుషులను పోల్చారు. వయసు, పొగతాగడం, ఇతర ఆరోగ్య సమస్యలు, వాడుతున్న ఇతర మందులు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే ఇది ఒక చిన్న క్లినిక్‌లో పది మంది, ఇరవై మంది మీద చేసిన ప్రయోగం కాదు. దాదాపు 74 వేల మంది ఆరోగ్య రికార్డుల ఆధారంగా జరిగిన పెద్ద స్థాయి విశ్లేషణ.
ఇక అసలు ఫలితం ఏంటంటే…
ఐదేళ్ల తర్వాత కనిపించిన తేడా. టడలాఫిల్ను క్రమం తప్పకుండా వాడినవారిలో ఐదేళ్లలో 3.93 శాతం మందికి గ్లాకోమా నమోదైంది. మందు వాడని గ్రూపులో అది 3.16 శాతం. వింటే పెద్ద తేడాలా అనిపించొచ్చు.
అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన లెక్క ఉంది. రెండు గ్రూపుల మధ్య అసలు తేడా ఒక శాతం కంటే కూడా తక్కువ. పరిశోధకుల లెక్క ప్రకారం, ప్రతి 10,000 మంది పురుషుల్లో సుమారు 77 అదనపు గ్లాకోమా కేసులు కనిపించేంత తేడా.
అంటే… వయాగ్రా లేదా టడలాఫిల్ వాడిన ప్రతి వ్యక్తికి గ్లాకోమా వస్తుందని అర్థం కాదు. అత్యధిక మంది పురుషులకు ఈ సమస్య రాలేదు. అయితే పరిశోధకులకు ఈ తేడా పూర్తిగా విస్మరించలేనంతగా కనిపించింది.
గ్లాకోమా అంటే ఏమిటి?
ఇక్కడే కథ మరింత సీరియస్ అవుతుంది. గ్లాకోమాను చాలామంది “కంటిలో నీరు పెరగడం” అని సాధారణంగా చెబుతుంటారు. కానీ అసలు సమస్య కంటిలోని ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం. కంటిని కెమెరా అనుకుంటే… కెమెరా తీసిన ఫొటోను మెదడుకు పంపే కేబుల్లాంటిది ఆప్టిక్ నర్వ్.
ఆ కేబుల్ దెబ్బతింటే?
కంటికి కనిపించిన సమాచారం మెదడుకు సరిగ్గా చేరదు. అక్కడే ప్రమాదం. గ్లాకోమా మొదటి దశల్లో చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. మనిషికి తన కళ్లలో ఏదో సమస్య మొదలైందనే అనుమానం కూడా రాకపోవచ్చు. కానీ లోపల మాత్రం చూపు నెమ్మదిగా దెబ్బతింటూ ఉండొచ్చు.
ఇంకో సమస్య ఏమిటంటే…ఒకసారి గ్లాకోమా వల్ల చూపు కోల్పోతే, ఆ చూపును సాధారణంగా తిరిగి తీసుకురావడం చాలా కష్టం. అందుకే ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
మరి వయాగ్రా కళ్లను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇక్కడే ఈ మేటర్ లో అసలు సైన్స్ మొదలవుతుంది. వయాగ్రా, టడలాఫిల్ వంటి మందులు PDE5 inhibitors అనే మందుల కుటుంబానికి చెందినవి. వీటి పని రక్తనాళాలను సడలించి రక్తప్రవాహాన్ని పెంచడం. అందుకే శరీరంలో కావాల్సిన ప్రాంతానికి రక్తప్రవాహం పెరుగుతుంది.అయితే మన శరీరంలో ఒక్క ప్రాంతంలోనే రక్తనాళాలు ఉండవు కదా. కంటిలో కూడా రక్తనాళాలు ఉన్నాయి. అంతేకాదు, PDE5 అనే ఎంజైమ్ కంటిలోని రెటీనా, కంటి రక్తనాళాలు, కంటి లోపలి ద్రవాన్ని తయారు చేసే ప్రాంతం, ఆప్టిక్ నర్వ్ దగ్గర కూడా ఉంటుంది.
అందుకే శాస్త్రవేత్తలకు ఒక అనుమానం వచ్చింది. ఈ మందులు కంటిలోని ద్రవం, రక్తప్రవాహం లేదా కంటి ఒత్తిడిపై దీర్ఘకాలంలో ఏమైనా ప్రభావం చూపుతున్నాయా?
కంటిలో ఒత్తిడి పెరిగితే?
మన కంటిని ఒక చిన్న నీటితో నిండిన గోళంలా ఊహించుకోండి. దానిలో ద్రవం తయారవుతుంది. అది బయటకు కూడా వెళ్లాలి. తయారయ్యే ద్రవం, బయటకు వెళ్లే ద్రవం మధ్య బ్యాలెన్స్ తప్పితే కంటి లోపలి ఒత్తిడి పెరగొచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ ఒత్తిడి ఆప్టిక్ నర్వ్‌కు నష్టం కలిగించవచ్చు. టడలాఫిల్ కంటి రక్తనాళాలను వెడల్పు చేయడం ద్వారా ఆక్వియస్ హ్యూమర్ అనే ద్రవం ఉత్పత్తిని ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
అయితే ఇక్కడ కూడా ఒక మెలిక ఉంది.
అదే రసాయన వ్యవస్థ కంటి ద్రవం బయటకు వెళ్లే ప్రక్రియకు కూడా సహాయపడే అవకాశం ఉంది. అంటే… ఒక వైపు ఒత్తిడి పెరిగే అవకాశం.. మరో వైపు తగ్గే అవకాశం. ఏ ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా పనిచేస్తుందో ఇప్పటికీ పూర్తిగా తెలియదు.
మరి వయాగ్రా వాడేవాళ్లు భయపడాలా?
ఇక్కడే ఆగాలి. ఈ అధ్యయనం చూసి “వయాగ్రా లేదా ఇలాంటి మరకొటి వాడటం ప్రమాదకరం” అని తేల్చేయడం సరికాదు. ఎందుకంటే ఇది observational study. అంటే పరిశోధకులు ఇప్పటికే ఉన్న ఆరోగ్య రికార్డులను పరిశీలించారు.
వారికి ఒక సంబంధం కనిపించింది. కానీ… “మందు తీసుకున్నందుకే గ్లాకోమా వచ్చింది” అని ఈ స్టడీ నిరూపించలేదు. ఇది చాలా ముఖ్యమైన తేడా.
అంతేకాదు, పరిశోధకులకు ప్రతి వ్యక్తి ఎంత మోతాదు మందు తీసుకున్నాడో, మొత్తం జీవితకాలంలో ఎంత మందు వాడాడో ఖచ్చితంగా తెలియదు. కంటి ఒత్తిడి, చూపు పరిధి, ఆప్టిక్ నర్వ్లో వచ్చిన మార్పులను కూడా నేరుగా కొలిచిన డేటా ఈ రికార్డుల్లో లేదు.
అందుకే ఈ ఫలితాలను హెచ్చరికగా చూడాలి.. తుది తీర్పుగా కాదు.
ఫైనల్ గా..
ఇదే ఈ కథలో చాలామంది మిస్ అయ్యే పాయింట్. అంగస్తంభన సమస్య కోసం వయాగ్రా లేదా ఇలాంటి మందులను చాలామంది అవసరమైనప్పుడు మాత్రమే వాడుతుంటారు. కానీ ఈ అధ్యయనం ప్రధానంగా క్రమం తప్పకుండా, దీర్ఘకాలం టడలాఫిల్ వాడిన పురుషులపై దృష్టి పెట్టింది.
అందుకే ఈ ఫలితాలను చూసి అప్పుడప్పుడు వాడే ప్రతి వ్యక్తి “నాకు కూడా గ్లాకోమా వస్తుందా?” అని భయపడాల్సిన అవసరం లేదు.








