ట్విన్ టవర్స్ పై దాడికి 25 ఏళ్లు.. వివాదాల నడుమ స్మారక కార్యక్రమం..!
అగ్రరాజ్యం అమెరికా గడ్డపై జరిగిన అతిపెద్ద దాడి.. వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన..2001లో అమెరికాపై ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. ఈ విషాద ఘటనను తల్చుకుంటూ.. ఏటా గ్రౌండ్ జీరోలో స్మారక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది అమెరికన్లు.. ఆనాటి ఘటనలో చనిపోయిన మృతులకు నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. అయితే ఈ అతిపెద్ద ఉగ్రదాడికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.
న్యూయార్క్‌లో నిర్వహించిన స్మారక కార్యక్రమం రాజకీయ విభేదాలు, వివాదాల నడుమ జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం, న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హాజరుపై తీవ్ర వ్యతిరేకత రావడం చర్చనీయాంశంగా మారింది. ఆనాటి దాడుల్లో ధ్వంసమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రదేశం ‘గ్రౌండ్ జీరో’లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ట్రంప్ హాజరు కాలేదు. ఆయన పెంటగాన్‌లో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
అయితే, న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరో వద్ద జరిగిన స్మారక సభకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, దాడులు జరిగినప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ డబ్ల్యూ. బుష్‌తో పాటు మాజీ అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎవరూ ప్రసంగాలు చేయలేదు. మృతుల కుటుంబ సభ్యులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను ఒక్కొక్కటిగా చదివి వినిపించారు. దాడిలోని కీలక ఘట్టాలను గుర్తుచేస్తూ గంటను మోగించారు.
ముస్లిం మేయర్‌పై వివాదం
ఈ కార్యక్రమానికి న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ హాజరు కావడంపై రైట్ వింగ్ వర్గాలు, న్యూయార్క్ పోస్ట్ పత్రిక, మాజీ మేయర్ రూడీ గిలియాని తీవ్రంగా వ్యతిరేకించారు. మమ్దానీని కార్యక్రమానికి దూరంగా ఉంచాలని కోరుతూ చేపట్టిన ఆన్లైన్ పిటిషన్‌పై లక్షకు పైగా సంతకాలు జరిగాయి. “మేయర్ ముస్లిం అయినందుకే ఆయన్ను భిన్నంగా చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది” అని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల మమ్దానీ, దాడుల తర్వాత లోయర్ మాన్‌హట్టన్‌లోని గాలిలో విష రసాయనాల స్థాయులపై వేలాది పత్రాలను విడుదల చేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ విషపూరిత గాలి వల్లే వేలాది మంది క్యాన్సర్ బారిన పడి నేటికీ బాధపడుతున్నారు.
మారని గాయాలు.. భద్రతా వలయం
2001 సెప్టెంబర్ 11న అల్-ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఢీకొట్టగా, మూడోది పెంటగాన్‌పై, నాలుగోది ప్రయాణికుల పోరాటంతో పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లే సమీపంలో కూలిపోయింది. ఈ దాడుల్లో మొత్తం 2,977 మంది మరణించారు. దాడుల అనంతరం వ్యాపించిన అనారోగ్య సమస్యలతో మరో 9,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ విషాదానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూయార్క్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రౌండ్ జీరో స్మారక స్థలి చుట్టూ సీక్రెట్ సర్వీస్ భద్రతా వలయం ఏర్పాటు చేసింది. ఎలాంటి ముప్పు సమాచారం లేనప్పటికీ, ముందుజాగ్రత్తగా యాంటీ-డ్రోన్ బృందాలను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. కార్యక్రమానికి ముందు న్యూయార్క్ హార్బర్ పైన 2,977 డ్రోన్ లైట్లతో బాధితులకు గుర్తుగా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు.








